ముచ్చటగా మూడోసారి టేప్ రివైండ్ చేసిన కేంద్ర మంత్రి

లోక్ సభలో అయినా రాజ్యసభలో అయినా ప్రకటన ఒక్కటే

Updated: Feb 10, 2018, 05:17 PM IST
ముచ్చటగా మూడోసారి టేప్ రివైండ్ చేసిన కేంద్ర మంత్రి

కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ‌్‌ జైట్లీ మూడోసారి శుక్రవారం సాయంత్రం రాజ్యసభలో ఓ ప్రకటన చేస్తారని తెలియడంతో ఈసారి చేయబోయే ప్రకటనలో అయినా ఏపీకి ఏమైనా వరాలు వుంటాయేమో చూద్దాం అని ఏపీకి చెందిన నేతలు, రాష్ట్ర ప్రజలు ఆశించారు. కానీ జైట్లీ మాత్రం లోక్ సభలో చేసిన ప్రకటన టేప్‌నే మళ్లీ పెద్దల సభలోనూ రివైండ్ చేసి వెళ్లిపోయారు. దీంతో ముచ్చటగా మూడోసారి ఆశాభంగం చెందడం ఏపీ వంతయ్యింది. 
 
రాజ్యసభలో జైట్లీ ప్రకటనకన్నా ముందుగా శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి రెండున్నర గంటలపాటు జైట్లీతో భేటీ అయి సమస్యల్ని మరోసారి విన్నవించారు. ఇంకా హామీలని జనం నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదని జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు. దీనికితోడు నిత్యం ఉభయ సభల్లో నిరసనల పర్వం ఎలాగూ వుండనే వుంది. ఈ నేపథ్యంలో జైట్లీ చేయబోయే ప్రకటనపై సుజనా చౌదరి భేటీ, ఎంపీల నిరసనల ప్రభావం వుంటుందనే అందరూ భావించారు. 

అయితే, జైట్లీ మాత్రం వీటన్నింటిని చాలా తేలిగ్గా తీసుకున్నట్టుగా తాను చెప్పాల్సింది చాలా స్పష్టంగా చెప్పారు. " నూతన రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చామని, రెవెన్యూలోటు ఎంత ఉంటుందనే అంశంపై సంబంధిత విభాగం నిగ్గుతేల్చుతుంది అని తెలిపారు. అంతేకాకుండా రైల్వేజోన్‌, దుగ్గరాజపట్నం పోర్టు, కడప ఉక్కు పరిశ్రమ, ఇండస్ట్రియల్ కారిడార్‌ లాంటి పనులు సంబంధిత శాఖల పరిశీలనలో వున్నాయని జైట్లీ వివరించారు. అంతకుమించి అదనంగా ఒక్క కొత్త విషయమైనా ఏపీకి అనుకూలంగా చెప్పకపోవడం తమని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది అంటున్నారు ఏపీ ఎంపీలు.