బాబ్లీ కేసు.. బీజేపీ కుట్రే: చంద్రబాబు

బాబ్లీ కేసు.. బీజేపీ కుట్రే: చంద్రబాబు

Last Updated : Sep 16, 2018, 04:08 PM IST
బాబ్లీ కేసు.. బీజేపీ కుట్రే: చంద్రబాబు

ఎనిమిదేళ్ల క్రితం నాటి బాబ్లీ వివాదంలో ఇప్పుడు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయడం ఏమిటని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రూ.222కోట్ల వ్యయంతో నిర్మించిన కొండవీడు ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. కొండవీడు వాగుకు వచ్చే వరదను కృష్ణా నదిలోకి పంపేందుకు మొత్తం 16 పంపుల నిర్మాణం చేపట్టామని, తద్వారా కొండవీటి వాగు ప్రాజెక్టుతో అమరావతికి వరద ముప్పు తప్పించామని చంద్రబాబు అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్సార్‌ఎస్పీ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్టు కట్టారని, ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆనాడు పోరాటం చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్రం కక్షపూరిత వైఖరికి బాబ్లీ కేసు నిదర్శనమన్నారు. అరెస్ట్‌ వారెంట్‌కు..బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అమిత్‌ షా అంటున్నారని.. కానీ కేంద్రంలో, మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వాలో ఒక్కసారి ఆలోచించాలని ఆయన గుర్తుచేశారు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రపూరిత చర్యేనని సీఎం అభిప్రాయపడ్డారు.

మరోవైపు.. బాబ్లీ కేసులో టీడీపీ కొత్త నాటకానికి తెరలేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బాబ్లీ కేసు విషయంలో కేంద్రంపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన.. సీఎం చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Trending News