నేడు దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాల సమర్పణ

Last Updated : Oct 14, 2018, 10:30 AM IST
నేడు దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాల సమర్పణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.  ఆదివారం సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం.. అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీ. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

అటు శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తుతున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని తిరుమల, శ్రీశైలం, బాసర, వేములవాడ తదితర పుణ్య క్షేత్రాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదోరోజు స్వామి వారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీవారు దర్శనమివ్వనున్నారు.

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం స్కందమాత అవతరాంలో భ్రమరాంబదేవి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సాయంత్రం శేషవాహనంపై భ్రమరాంబసమేత మల్లికార్జునస్వామి దర్శనమివ్వనున్నారు.

బాసరలో ఐదోరోజు దేవి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈరోజు స్కందమాత అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన ఇవాళ అమ్మవారు స్కందమాత అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Trending News