కేంద్రం పిలుపు.. నేడు ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు.

Last Updated : Apr 24, 2018, 04:01 PM IST
కేంద్రం పిలుపు.. నేడు ఢిల్లీకి వెళ్లనున్న గవర్నర్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో భేటీ కానున్నారు. ఏపీ పరిణామాలతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవలే తెరపైకి తెచ్చిన ఫెడరల్‌ ఫ్రంట్‌ తదితర అంశాలపై కేంద్రానికి నివేదిక అందించే అవకాశం ఉంది.

ఇటీవల గవర్నర్‌ నరసింహన్‌ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. వారి అసంతృప్తి, ఆవేదన, ప్రజల మనోభావాలు ఇతర అంశాలను తెలుసుకున్నారు. సోమవారం ఆయనను ఢిల్లీకి రావాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనిని ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి అందజేసే అవకాశం ఉంది. ఈనెల 26న ఆయన హైదరాబాద్‌కు తిరిగివస్తారు. గవర్నర్‌ గత నెలలో ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలుగు రాష్ట్రాలలో పర్యటించి, ఇక్కడి పరిస్థితులపై కేంద్రానికి నివేదిక ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తాజా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Trending News