వైఎస్‌ జగన్ ఆస్తుల కేసులో తొలిసారి ఆయన భార్య పేరు!

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన భార్య భారతిపై అభియోగాలు నమోదయ్యాయి.

Last Updated : Aug 10, 2018, 12:01 PM IST
వైఎస్‌ జగన్ ఆస్తుల కేసులో తొలిసారి ఆయన భార్య పేరు!

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన భార్య భారతిపై అభియోగాలు నమోదయ్యాయి. జగన్ ఆస్తుల కేసులకు సంబంధించిన ఛార్జ్ షీటులో ఆయన భార్య భారతి పేరును ఈడీ చేర్చింది. భారతీ సిమెంట్స్‌కు సంబంధించి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీటులో ఆమెను ఏ5గా చేర్చినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైంది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలైంది.

ఇప్పటికే ఈ కేసులో జగన్, విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్ కార్పొరేషన్, జే.జగన్మోహన్ రెడ్డి, సిలికాన్ బిల్డర్, సండూర్ పవర్ లిమిటెడ్ క్లాసిక్ రియాలిటీ, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో పాటు ఆమె పేరును చేర్చింది. సీబీఐ గతంలో దాఖలు చేసిన 11 ఛార్జ్ షీట్లలో భారతీ పేరులేకపోగా.. తాజాగా ఆమె పేరును ఈడీ చేర్చడం చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ అధినేత వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో రూ. 750 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో ఉన్న అనేక ఆస్తులను గుర్తించి మనీ లాండరింగ్‌ కేసు కింద సుమారు రూ.750 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.5 వేల కోట్ల పైమాటే. ఇప్పటికే గతంలో నాలుగు విడతలుగా జగన్‌ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటి విడతగా రూ.200 కోట్లు, రెండవ విడతలో రూ.43 కోట్లు, మూడవ విడతలో రూ.225 కోట్లు, నాలుగోసారి రూ.750 కోట్లు అటాచ్‌ చేసింది.

రఘురామ్ సిమెంట్స్ ఒప్పందంలో వైఎస్ భారతి అనే పేరుతో డబ్బు లావాదేవీలు జరిగాయని ఈడీ పేర్కొంది. రఘురామ్(భారతి) సిమెంట్స్‌లో సండూర్ పవర్, కారమేల్ ఏషియా లిమిటెడ్, ఇతర కంపెనీలు హవాలా ద్వారా నిధులను మళ్లించినట్లు ఆరోపించింది. PMLA చట్టం సెక్షన్ 3 కింద నిందితులను ప్రత్యేక కోర్టు శిక్షించాలని ఈడీ కోరింది.

Trending News