సుప్రీం కోర్టులో తెలుగు రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన కేంద్రం

ఏపీ, తెలంగాణకు కేంద్రం షాక్ 

Last Updated : Jun 14, 2018, 01:57 PM IST
సుప్రీం కోర్టులో తెలుగు రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన కేంద్రం

ఇప్పటికే రాష్ట్ర విభజనలోని అనేక అంశాలను, హామీలను కేంద్రం పూర్తిగా నెరవేర్చలేదనే ఆగ్రహంతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి సరైన తోడ్పాటు అందడం లేదనే కారణంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదని తేల్చిచెబుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు 2014లో ఈ రెండు ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను మాత్రమే పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది కానీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందిగా స్పష్టం చేయలేదనే విషయాన్ని కేంద్రం ఈ అఫిడవిట్ ద్వారా సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారమే బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సవాలు చేస్తూ కేంద్రం ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

వాస్తవానికి ఉక్కు కర్మాగారాల ఏర్పాటు 2014లోనే సాధ్యం కాదని తెలుగు రాష్ట్రాలకు స్పష్టంగా చెప్పినట్టు కేంద్రం తమ అఫిడవిట్‌లో పేర్కొంది. అయితే, పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆయా రాష్ట్రాలు  సూచనలు చేశాయని ఈ సందర్భంగా కేంద్రం గుర్తుచేసింది. సాధ్యాసాధ్యాలపై ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరి, ఆ మేరకు వారు ఇచ్చిన నివేదికలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ అంతిమ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం సుప్రీం కోర్టుకి తెలిపింది. కేంద్రం ఇచ్చిన ఈ సమాధానంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించనున్నాయో వేచిచూడాల్సిందే మరి.

Trending News