ఏపీలో కొత్తమంత్రులుగా ఫరూఖ్, కిడారి శ్రావణ్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు క్యాబినెట్ విస్తరణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన మంత్రులుగా కిడారి శ్రావణ్‌కుమార్‌, ఎన్‌.ఎమ్‌.డి. ఫరూక్‌‌లు ప్రమాణస్వీకారం చేశారు. 

Last Updated : Nov 11, 2018, 01:04 PM IST
ఏపీలో కొత్తమంత్రులుగా ఫరూఖ్, కిడారి శ్రావణ్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు క్యాబినెట్ విస్తరణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన మంత్రులుగా కిడారి శ్రావణ్‌కుమార్‌, ఎన్‌.ఎమ్‌.డి. ఫరూక్‌‌లు ప్రమాణస్వీకారం చేశారు. ఉండవల్లిలో ఏపీ గవర్నర్ నరసింహన్ వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. అయితే ప్రమాణ స్వీకారం చేసినా.. కొత్త మంత్రులకు శాఖలు ఇంకా కేటాయించలేదు. బహుశా శ్రావణ్‌కు గిరిజన సంక్షేమశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అలాగే ఫరూక్‌కు మైనారిటీ సంక్షేమ శాఖతోపాటు, ఆరోగ్య శాఖ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఎమ్మెల్యే కాకుండానే చట్టసభలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కిడారి శ్రావణ్‌కు దక్కడం గమనార్హం. ఇటీవలే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని మావోయిస్టులు హత్య చేసిన క్రమంలో ఆయన కుటుంబానికి ఊరటనిస్తూ తగిన న్యాయం చేస్తామని చంద్రబాబు  ప్రకటించారు. సర్వేశ్వరరావు కుమారుల్లో ఒకరికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడంతో పాటు మరొకరికి మంత్రి పదవి ఇస్తున్నట్లు తర్వాత ప్రకటించారు. 

ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా చట్టసభకు మంత్రిగా ఓ వ్యక్తి ప్రమాణస్వీకరం చేయడం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ చరిత్రలో ఇది రెండవ సారి కావడం గమనార్హం. గతంలో 1995లో నందమూరి హరికృష్ణ ఈ విధంగానే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండా మంత్రిగా బాధ్యతలు స్వీకరించే వ్యక్తి ఆరు నెలలలో ఏదో ఒక చట్టసభకు ఎన్నిక కావాల్సిందే. కానీ అరకులో పరిస్థితి వేరు. సాధారణ ఎన్నికలకు కనీసం సంవత్సరం కూడా సమయం లేకపోవడంతో ఉప ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. అయినప్పటికీ మంత్రిగా ఆరు నెలలు శ్రావణ్‌ రాష్ట్రానికి సేవలు అందించే అవకాశం ప్రభుత్వం కల్పించడం గమనార్హం. వారణాశి ఐఐటీలో మెటలర్జీ చేసిన శ్రావణ్, సివిల్స్ పరీక్షల కోసం కోచింగ్ కూడా తీసుకున్నారు. సాధారణ ఎన్నికలలో కూడా అరకు నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రావణ్‌కే పార్టీ అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

Trending News