వ్యవసాయంలో పెట్టుబడులు; సీమలో సెల్‌ఫోన్ పరిశ్రమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్చిదిద్దిన 'రియల్ టైం గవర్నెన్స్(ఆర్టీజీ) ' బాగుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కితాబిచ్చారు.

Last Updated : Feb 14, 2018, 01:37 PM IST
వ్యవసాయంలో పెట్టుబడులు; సీమలో సెల్‌ఫోన్ పరిశ్రమ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్చిదిద్దిన 'రియల్ టైం గవర్నెన్స్(ఆర్టీజీ) ' బాగుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కితాబిచ్చారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీజీతో ప్రజలకు అందిస్తున్న సేవలను చంద్రబాబు ఆయనకు వివరించారు. అంబానీ మాట్లాడుతూ.. ఆర్టీజీ సేవలు బాగున్నాయని, ఏపీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.  

సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని, అందుకు అవకాశమివ్వాలని అంబానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు దేశానికి పెద్ద సవాలు వంటివని, వాటిలో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశాలివ్వాలని అన్నారు. వ్యవసాయ రంగంలో తమ కంపెనీ పెట్టుబడులు పెడుతుందని, తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు.

 

రాష్ట్రంలో మొబైల్ తయారీ కేంద్రం

రాయలసీమలో ఒక మొబైల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని యోచిస్తున్నట్లు ముఖేశ్ సీఎం చంద్రబాబుకు తెలిపారు. నెలకు 10 లక్షల సెల్‌ఫోన్లు తయారు చేసే సామర్థ్యంతో ఈ యూనిట్‌ను నెలకొల్పాలని భావిస్తున్నామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చూస్తున్నట్లు చెప్పారు. తగిన ప్రతిపాదనలతో వస్తే పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అంబానీకి చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని స్వగృహంలో ప్రత్యేక విందు ఇచ్చారు. అనంతరం అంబానీ ముంబైకి తిరిగి వెళ్లారు.

Trending News