ఇది తెలుగువాళ్ల ఆత్మగౌరవ సమస్య -చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను సాధించుకోవడం తెలుగు ప్రజల ఆత్మగౌరవ సమ్యస్యగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Updated: Mar 14, 2018, 12:31 PM IST
ఇది తెలుగువాళ్ల ఆత్మగౌరవ సమస్య -చంద్రబాబు

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను సాధించుకోవడం తెలుగు ప్రజల ఆత్మగౌరవ సమ్యస్యగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని స్థితిలో ప్రధాన మంత్రి ఉన్నారని, అందుకే గట్టిగా అడుగుతున్నామని అన్నారు. రాష్ట్ర శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం సీఎం మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. విభజన చట్టంలోని 18 అంశాలపై సమీక్ష చేసి, డాక్యుమెంటరీ ఎవిడెన్సుతో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

'రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడతాం.. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం. ఆ అనుభవం నాకుంది. కష్టపడే తత్వం ప్రజలకుంది. కానీ హక్కుల విషయంలో బీజేపీ అప్పుడో రకంగా ఇప్పుడో రకంగా మాట్లాడుతూ.. న్యాయం చేయాల్సింది పోయి ఎదురు దాడి చేయడం ఎంత వరకు న్యాయమో ఆలోచించుకోవాలి' అని సీఎం అన్నారు. తెలుగు ప్రజలకు ఎన్.టీ.రామారావు ఆత్మగౌరవం ఇస్తే, తాను ఆత్మ విశ్వాసం ఇచ్చానని.. వాగ్దానాలను సాధించుకుంటామని చెప్పారు.

'కేంద్ర మంత్రి గారు ఓ మాట అన్నారు. 'సెంటిమెంట్‌కు డబ్బులు రావు' అని. కానీ ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి సెంటి మెంట్ కోసమే 'తెలంగాణ' రాష్ట్రాన్ని ఇచ్చారు. అట్లాగే ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను కూడా గౌరవించాలి' అని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. కేంద్రానికి దక్షిణాది నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని, కానీ వాటిని ఉత్తరాదిలో ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కీలకమైన విశాఖపట్టణం రైల్వే జోన్, సెంట్రల్ వర్సిటీ, కడప ఉక్కు కర్మాగారం వంటివి కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. వైకాపా ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని, మోదీ వల్లే హోదా సాధ్యమంటూనే, ఎలా అవిశ్వాసం పెడతారని ప్రశ్నించారు.

 

 

తనకు ప్రజలే హైకమాండ్ అని, ఇచ్చిన హామీలను అమలుపరచకపోతే నష్టపోయేదీ బీజేపీయేనని చెప్పారు. ప్రజల మనోభావాలను గుర్తించి..ఇప్పటికైనా కేంద్రం విభజన చట్టంలోని వాగ్దానాలను అమలు చేయాలని కోరారు. బీజేపీకి మిత్రపక్షంగానే ఉన్నామని, హామీలను సాధించుకొనే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.