కోడిపందేలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చేనా ?

కోడిపందేలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది

Updated: Jan 12, 2018, 11:32 AM IST
కోడిపందేలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చేనా ?

సంక్రాంతి సాంప్రదాయ క్రీడ కోడిపందేలకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది.  ఇటీవలే కోడిపందేలకు అనుమతి నిరాకరిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రఘరామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ దీపక్ ఖన్విల్కర్ ,జస్టిస్ చంద్రచూడ్ లతో కూడిన ధర్మాసనం ముందు గురువారం పిటిషనర్ తరఫు న్యాయవాది గల్లా సతీష్  స్పెషల్ లీవ్ పిటిషన్ ప్రస్తావించారు. 

వాస్తవానికి ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టాలని ధర్మాసనం భావించింది..అయితే సోమవారం నాటికి పండగ అయిపోతుందని వెంటనే విచారించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోరగా శుక్రవారం విచారణ జరుపుదామని జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు. ఈ మేరకు కోడిపందేలపై ఈ రోజు విచారణ జరగనుంది. కాగా కోడిపందేలపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. 

అప్పుడు జల్లి కట్టు..ఇప్పుడు కోడిపందేలు..

తమిళనాడు జల్లికట్టు క్రీడను కూడా ఇదే తరహాలో న్యాయస్థానాలు నిషేదించాయి. కోర్టు తీర్పుపై జనాలు ఆందోళనకు దిగడంతో సుప్రీంకోర్టు జల్లి కట్టు క్రీడకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. జల్లికట్టు తీర్పును పరిణగనలోకి తీసుకొని సంక్రాంతి సాంప్రదాయ క్రీడ కోడిపందేలకూ కోర్టు అనుమతి ఇస్తుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు...