మా అసోసియేషన్‌లో చిరు, మహేష్‌బాబుకి అరుదైన గౌరవం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ అరుదైన గౌరవం దక్కనుంది

Updated: Feb 14, 2018, 01:37 PM IST
మా అసోసియేషన్‌లో చిరు, మహేష్‌బాబుకి అరుదైన గౌరవం

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ అరుదైన గౌరవం దక్కనుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆవరణలో నిర్మించనున్న కొత్త భవనాల్లో రెండు విభాగాలకు చిరంజీవి, మహేష్ బాబుల పేర్లు పెట్టనున్నట్టు మా అధ్యక్షుడు శివాజీ రాజా ప్రకటించారు. ఇటీవల జరిగిన మా వేడుక సక్సెస్ అయిన నేపథ్యంలో నిన్న మా కార్యవర్గ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ శివాజీరాజా ఈ వివరాలని ప్రకటించారు. అమెరికా నుంచి ఫండ్ రైజింగ్ కోసం అమెరికాలో చేపట్టనున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా తాము కోరిన వెంటనే అంగీకరించినందుకు ఈ సందర్భంగా మెగాస్టార్, సూపర్ స్టార్‌లకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అని అన్నారు శివాజీ రాజా.

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు లాంటి వాళ్ల సహకారం తమ అసోసియేషన్‌కి వుందన్న శివాజీ రాజా.. అసోసియేషన్‌లో నటులు శ్రీకాంత్, నరేష్, నాగిరెడ్డి, ఉత్తేజ్ లాంటి వాళ్ల సహకారం కూడా మరవలేనిది అని తెలిపారు. మా అసోసియేషన్ అభివృద్ధిని, చేపడుతున్న కార్యక్రమాలని చూసి తమిళ నడిగర్ సంఘం పెద్దలు సైతం ఆశ్చర్యపోయారు. మా అసోసియేషన్ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఎంతో వుందని స్వయంగా నడిగర్ సంఘం ప్రతినిధులే అభిప్రాయపడటం ఎంతో స్పూర్తినిచ్చింది అని చెప్పిన శివాజీ రాజా.. త్వరలోనే మా కోసం బిల్డింగ్ తోపాటు వృద్ధాశ్రమం కూడా నిర్మిస్తామని స్పష్టంచేశారు.