అజ్ఞాతవాసి చిత్రం కాపీరైట్స్ ఉల్లంఘించిందా..?

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' చిత్రంపై ఇప్పుడు వాడీ వేడి చర్చ నడుస్తోంది. 

Updated: Jan 3, 2018, 06:53 PM IST
అజ్ఞాతవాసి చిత్రం కాపీరైట్స్ ఉల్లంఘించిందా..?

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' చిత్రంపై ఇప్పుడు వాడీ వేడి చర్చ నడుస్తోంది. ఈ చిత్రం కాపీరైట్స్‌‌ను ఉల్లంఘించిందని కొన్ని వార్తలు రావడంతో పాటు.. ఈ చిత్రం ఫ్రెంచి చిత్రం 'లార్గో వించ్'ను కాపీ కొట్టి తీశారని కూడా కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో 'లార్గో వించ్' రీమేక్ రైట్స్ పొందిన టీ సీరీస్ సంస్థ ఇప్పటికే 'అజ్ఞాతవాసి' నిర్మాతలకు నోటీసులు కూడా పంపిందని వార్తలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త ఒక్కటి  'లార్గో వించ్' దర్శకుడు  జెరోమ్ సల్లే వరకు కూడా వెళ్లడంతో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.

"నేను టిక్కెట్ కొనాలనుకుంటున్నాను.. ఈ సినిమా టికెట్ కొనకముందు దాన్ని చూడడానికి విమాన టికెట్ కొనాలి" అని ఆయన  'అజ్ఞాతవాసి' పేరుకి ట్యాగ్ చేసి మరీ ట్విటర్‌లో స్పందించారు. ఓ ధనవంతుడు దత్తత తీసుకున్న కుర్రాడు.. ఎలా తన తండ్రిని చంపిన వారిని కనుగొంటాడో.. తానెవరన్న విషయం ఎలా బయటపెడతాడో అన్నది 'లార్గో వించ్' కథాంశం.  'అజ్ఞాతవాసి' ట్యాగ్ లైన్ కూడా "ప్రిన్స్ ఇన్ ఎక్సైల్" అని ఉండడం వల్ల.. అది అజ్ఞాతంలో ఉన్న రాకుమారుడు అనే అర్థం వచ్చేలా ఉండడంతో ఆ సినిమా 'లార్గో వించ్'కి రీమేక్ అనే అందరూ ఇప్పుడు భావిస్తున్నారు. 

'లార్గో వించ్' దర్శకుడు తాను పవన్ కళ్యా‌ణ్ సినిమా చూస్తానని ట్విటర్‌లో చెప్పాక.. ఆ వార్త దావానలంలా వ్యాపించింది. ఫ్రాన్స్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన జెరోమ్ మరి 'అజ్ఞాతవాసి' చూసి ఎలాంటి రివ్యూ ఇస్తారన్న విషయంపై అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఒకవేళ ఈ సినిమా నిజంగానే 'లార్గో వించ్'ను కాపీ కొడితే పర్యవసానాలు ఏమిటన్నది కూడా నిర్మాతలు ఆలోచించాలని కూడా సినీ విమర్శకులు అంటున్నారు. 'లార్గో వించ్' 2008 సంవత్సరంలో ఫ్రాన్స్‌ను ఒక్క ఊపు ఊపిన చిత్రం. అతి పెద్ద బాక్సాఫీసు హిట్ కూడా.

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close