నా కథ వింటే పవన్ కల్యాణ్ తప్పకుండా సినిమా చేస్తారు : మంజుల

నేను రాసుకున్న కథ వింటే పవర్ స్టార్ కచ్చితంగా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు : మంజుల ఘట్టమనేని

Updated: Feb 10, 2018, 02:08 PM IST
నా కథ వింటే పవన్ కల్యాణ్ తప్పకుండా సినిమా చేస్తారు : మంజుల

'తాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఓ కథ రాసుకున్నానని, ఆయన కానీ ఆ కథ వింటే కచ్చితంగా తన సినిమా చేయడానికి ఓకే చెబుతారు' అని అన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, సినీ నటి, డైరెక్టర్ మంజుల ఘట్టమనేని. తాజాగా మంజుల డైరెక్టర్‌గా తెరకెక్కించిన మనసుకి నచ్చింది అనే సినిమా ఆడియో రిలీజైన నేపథ్యంలో ఆ ఫంక్షన్ వద్ద మీడియా మిత్రులతో మాట్లాడిన ఆమె తన మనసులో మాటను బయటపెట్టారు. ' పవన్ కల్యాణ్ కోసం ఓ సినిమా రాసుకున్నారని తెలిసింది నిజమేనా ?' అని ఓ ఫిలిం జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆమె ఈ విధంగా సమాధానం చెప్పారు. 

నాన్న గారు, సోదరుడు మహేష్ బాబు తర్వాత మళ్లీ తాను అంతగా అభిమానించేది పవన్ కల్యాణ్‌నే అని అభిప్రాయపడిన మంజుల.. పవర్ స్టార్‌ది నిజాయితీ గల వ్యక్తిత్వం అని అన్నారు. ఆయన తన మనసుకు నచ్చిందే చేస్తారు. అందుకే ఆయన అంటే అభిమానం. రాజకీయాలతో బిజీ అవుతున్న పవన్ ఇకపై సినిమా చేస్తారని అనుకోవడం లేదు కానీ ఒకవేళ తాను రాసుకున్న కథ వింటే మాత్రం కచ్చితంగా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అని అన్నారామె. అంతేకాకుండా.. మంజుల కథ వినమని మీరైనా చెప్పండి అంటూ సరదాగానే ఫిలిం జర్నలిస్టుల వద్ద తన కోరికను వెల్లడించారామె. ఆనోటా ఈనోటా ఈ విషయం పవర్ స్టార్ వరకు వెళ్లకపోతుందా ? అప్పుడు ఆయన ఏమని స్పందిస్తారో చూడాల్సిందే మరి!!