పవర్ స్టార్ "పవన్ కళ్యాణ్" సినీ జర్నీ

Last Updated : Sep 26, 2017, 04:12 PM IST
పవర్ స్టార్ "పవన్ కళ్యాణ్" సినీ జర్నీ

పవన్ కళ్యాణ్ లేదా పవర్ స్టార్ పేరుతో ప్రసిద్ధుడైన కొణిదెల కల్యాణ్ బాబు ప్రముఖ తెలుగు సినీ నటుడు మరియు దర్శకుడు.  కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతులకు సెప్టెంబరు 2, 1972న బాపట్లలో జన్మించిన పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ కథానాయకుడు & మెగాస్టార్‌గా పేరుగాంచిన చిరంజీవికి స్వయానా తమ్ముడు.  నెల్లూరులోని వి.ఆర్.సి కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన కళ్యాణ్ కంప్యూటర్ డిప్లొమా చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు జిమ్నాస్టిక్స్‌‌తో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయిన కళ్యాణ్,  విశాఖపట్నంలోని సత్యానంద్  ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో కొన్నాళ్లు శిక్షణ  తీసుకున్నారు. 

1996లో "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" చిత్రం ద్వారా తొలిసారిగా తెలుగు తెరకి పరిచయమైన కళ్యాణ్ ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం, బద్రి, తొలిప్రేమ, తమ్ముడు, ఖుషీ, బంగారం, బాలు, అన్నవరం, జల్సా, అత్తారింటికి దారేదీ మొదలైన చిత్రాలలో నటించి లెక్కలేనంత మంది అభిమానులను పొందారు. తొలిప్రేమ చిత్రం కళ్యాణ్‌కు తీసుకొచ్చిన యూత్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం కూడా అందుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ తనదైన పంథాలో నటిస్తూ విభిన్నమైన కథాంశాలతో కూడిన చిత్రాలకు సైన్ చేశారు. తను నటించిన పలు చిత్రాలలో పాటలు కూడా పాడారు. అలాగే కొన్ని పాటలకు కొరియోగ్రఫీ కూడా చేశారు. 2013లో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రముఖ భారతీయ నటుల జాబితాలో కళ్యాణ్ కూడా చోటు దక్కించుకున్నారు.  2014లో పవన్ కళ్యాణ్  జనసేన పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. 

విశేషాలు

* నిర్మాతగా వ్యవహరించిన చిత్రాలు - ముగ్గురు మొనగాళ్లు (1994), సర్దార్ గబ్బర్ సింగ్ (2016)

*  దర్శకుడిగా తొలి చిత్రం - జానీ (2003)

*  స్టంట్స్ కో ఆర్డినేటరుగా వ్యవహరించిన చిత్రాలు - తమ్ముడు, బద్రి, ఖుషీ, డాడీ, జానీ, గుడుంబా శంకర్, తీన్మార్

* కథా సహకారం అందించిన చిత్రాలు - జానీ, గుడుంబా శంకర్, సర్దార్ గబ్బర్ సింగ్ 

 అవార్డులు - రివార్డులు

* ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు (ఉత్తమ నటుడు) - గబ్బర్ సింగ్ (2012)
*  సంతోషం అవార్డ్స్ (ఉత్తమ నటుడు)- అత్తారింటికి దారేదీ (2013)

Trending News