వెండితెర మహానటి సావిత్రి నట జీవన ప్రస్థానం

Last Updated : Sep 26, 2017, 06:11 PM IST
వెండితెర మహానటి సావిత్రి నట జీవన ప్రస్థానం

తెలుగు సినీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సావిత్రి. తెలుగుతో పాటు తమిళ, హిందీ చలనచిత్రాల్లో కూడా నటించి తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న మేటి నటి ఆమె.కేవలం ఒక నటిగానే కాకుండా, పలు చిత్రాలకు నిర్మాతగా, దర్శకురాలిగా కూడా వ్యవహరించిన ఘనత సావిత్రిది. 

గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని చిర్రావూరు గ్రామంలో జనవరి 11, 1937 తేదీన శంకరరావు, సుభద్రమ్మ దంపతులకు జన్మించిన సావిత్రి విజయవాడలోని కస్తూరిబాయి మెమోరియల్ స్కూలులో చదువుకున్నారు. అలా చదువుకుంటున్న సందర్భంలోనే ప్రముఖ శాస్త్రీయ నృత్య శిక్షకులు శ్రీ శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి వద్ద నాట్యం నేర్చుకొని, ఆ వయసులోనే ప్రదర్శనలు కూడా ఇవ్వసాగారు. అలా ప్రదర్శనలు ఇస్తున్న సమయంలోనే నాటకాల్లో కూడా నటించారు. సినీ రంగంలోకి ప్రవేశించాక, తొలుత కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రలో నటించింది సావిత్రి. ఆ తర్వాత విడుదలైన "పెళ్ళిచేసిచూడు" సావిత్రి సినీ జీవితంలో మరో మలుపు. అయితే ఆమెలోని నటనా ప్రతిభను పూర్తిగా పరిపుష్టం చేసిన సినిమా వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో వచ్చిన "దేవదాసు".ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో "మిస్సమ్మ"లో ప్రధానపాత్ర పోషించింది. ఆ చిత్రంతో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా స్థిరపడింది. ఆ తరువాత వచ్చిన దొంగరాముడు, అర్థాంగి, చరణదాసి ఆమె స్థానాన్ని మరింత పదిలపరచాయి.1957 లో వచ్చిన  మాయాబజార్ చిత్రంలో సావిత్రి ప్రదర్శించిన అసమాన ప్రతిభ మరియె వైదుష్యం ఆమె కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. 

1968లో "చిన్నారి పాపలు" సినిమాతో దర్శకురాలిగా మారిన సావిత్రి, ఆ తర్వాత చిరంజీవి,మాతృదేవత, వింత సంసారం మొదలగు సినిమాలకు కూడా దర్శకత్వం వహించడం జరిగింది. 

గుండమ్మ కథ, రక్తసంబంధం, మంచి మనసులు, ఆరాధన, నర్తనశాల, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు, వరకట్నం, కలిసి ఉంటే కలదు సుఖం, సుమంగళి మొదలైనవి ఈమె నటించిన ఇతర ప్రముఖ చిత్రాలు. 

అవార్డులు - రివార్డులు
ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు (ఉత్తమ నటి )  - దేవదాసు (1953), మాయాబజార్ (1957), గుండమ్మ కథ (1962), డాక్టర్ చక్రవర్తి (1964), మరో ప్రపంచం (1970)

Trending News