రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చిన 'అర్జున్ రెడ్డి'

అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమాను బాగా ప్రమోట్ చేసిన వర్మ.. అందులో టైటిల్ రోల్ పోషించిన విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేశాడు.

Updated: Mar 12, 2018, 09:24 PM IST
రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చిన 'అర్జున్ రెడ్డి'

అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కంట్లోపడిన నటుడు విజయ్ దేవరకొండ. విడుదల సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కుంటోన్న అర్జున్ రెడ్డి సినిమాకు వర్మ ఎంతో మద్దతుగా నిలిచాడు. టాలీవుడ్‌లో రావాల్సిన సినిమా అర్జున్ రెడ్డి అంటూ ఆ సినిమాను ప్రమోట్ చేసిన వర్మ.. అందులో టైటిల్ రోల్ పోషించిన విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేశాడు. అప్పట్లోనే వీళ్లద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వచ్చినా రావచ్చనే టాక్ వినిపించింది. అప్పటి సంగతి ఎలా వున్నా... తాజాగా విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేద్దాం అనుకున్నాడట వర్మ. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఊహించని విధంగా రాంగోపాల్ వర్మకు నో చెప్పాడని టాక్.

వర్మ తనతో సినిమా చేసేందుకు సిద్ధంగా వున్నా.. ప్రస్తుతం ఆ సినిమాకు ఎస్ చెప్పడానికి విజయ్ దేవరకొండ సిద్ధంగా లేడనేది ఆ టాక్ సారాంశం. అందుకు కారణం ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో చాలా సినిమాలు వుండటమేనని తెలుస్తోంది. ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేను కనుక మీతో సినిమా చేయలేను అని రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఆఫర్‌ని సున్నితంగానే తిరస్కరించాడట విజయ్ దేవరకొండ. 

ఇక వర్మ ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్ట్ విషయానికొస్తే, నాగార్జున ప్రధాన పాత్రలో వర్మ డైరెక్ట్ చేస్తోన్న ఆఫీసర్ సినిమా సైతం ఆఖరి దశకు చేరుకున్నట్టు సమాచారం. నిర్మాత హ్యాండ్ ఇచ్చిన కారణంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అటకెక్కినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వర్మ తన తర్వాతి సినిమా గురించి ప్లాన్ చేసుకుంటున్నాడట.