బిగ్ బీకి అస్వస్థత.. అభిమానుల్లో ఆందోళన

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు.

Updated: Mar 13, 2018, 03:35 PM IST
బిగ్ బీకి అస్వస్థత.. అభిమానుల్లో ఆందోళన

సినిమా షూటింగ్ లో ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫతేమా సనా షేక్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతోన్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో షూటింగ్ జరుపుకొంటోంది. అమితాబ్ షూటింగ్ లో తన భాగాన్ని పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే  ఆయనను  స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బిగ్ బీకి చికిత్స అందించడానికి ముంబై నుంచి జోధ్‌పూర్‌కు ప్రత్యేక వైద్య బృందం కూడా బయలుదేరింది. అమితాబ్ కొంత కాలంగా మెడ నొప్పి, వెన్నునొప్పితో బాధ పడుతుండగా.. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

అమితాబ్ మ‌రోసారి అస్వస్థతకు గుర‌వడంతో అభిమానులు తీవ్ర ఆందోళ‌న‌ చెందుతున్నారు. త్వరగా కోరుకోవాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలతో పోటీ పడుతూ తనదైన నటనతో అభిమానులను అలరిస్తున్న అమితాబ్.. 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమాతో పాటు బ్రహ్మస్త్రా, 102 అనే చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. బిగ్ బీ  తన ఆరోగ్యంపై స్పందించారు. అభిమానులు ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. 'నేను విశ్రాంతి తీసుకుంటాను. ఆరోగ్యంపై సమాచారం ఇస్తుంటాను' అని  అన్నారు.