రూ. 64 లక్షల కరెంట్ బిల్లు కట్టలేక మరణిస్తే.. ఆ హీరో ఏం చేశాడు?

స్నేహితుడి మరణానికి కారణం తెలుసుకున్న ఓ న్యాయవాది కోర్టులో విద్యుత్ శాఖ మీద దావా వేస్తాడు. ఇదీ ‘బత్తీ గుల్‌ మీటర్‌ చాలూ’ అనే బాలీవుడ్ సినిమా కథ. 

Updated: Aug 10, 2018, 08:39 PM IST
రూ. 64 లక్షల కరెంట్ బిల్లు కట్టలేక మరణిస్తే.. ఆ హీరో ఏం చేశాడు?

ఎంట్రప్రెన్యూర్‌గా కెరీర్ ప్రారంభించిన ఓ యువకుడు చిన్న కంపెనీ నడుపుకుంటూ ఉంటాడు. అయితే విద్యుత్ కష్టాల కారణంగా జనరేటర్ మీదే ఎక్కువశాతం ఆధారపడతాడు. అయినా సరే.. ఆయనకు రూ.64 లక్షల రూపాయల కరెంటు బిల్లు వస్తుంది. ఇదేం అన్యాయమని ఆయన విద్యుత్ శాఖ వారిని ప్రశ్నిస్తే.. వారు ఎదురుతిరిగి.. అతను గనుక బిల్లు కట్టకపోతే ఇక జీవితంలో ఆ కంపెనీకి కరెంటు సరఫరా లేకుండా చేస్తామని బెదిరిస్తారు.

గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ యువకుడు మరణిస్తాడు. స్నేహితుడి మరణానికి కారణం తెలుసుకున్న ఓ న్యాయవాది కోర్టులో విద్యుత్ శాఖ మీద దావా వేస్తాడు. ఇదీ ‘బత్తీ గుల్‌ మీటర్‌ చాలూ’ అనే బాలీవుడ్ సినిమా కథ. సగటు మనిషి కరెంటు కష్టాల మీద సెటైరికల్‌గా తీసిన సీరియస్ సినిమా ఇది. ఈ సినిమాలో న్యాయవాది పాత్రలో బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్ నటిస్తుండగా.. విద్యుత్ శాఖ తరఫున కేసు వాదించే పాత్రలో నటి యామి గౌతమ్ నటిస్తున్నారు. శ్రీనారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజే విడుదలైంది. 

ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. దివ్యేందు శర్మ, సుధీర్ పాండే, ఫరీదా జలాల్, అతుల్ శ్రీవాస్తవ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భూషణ్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అను మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా.. అన్షుమన్ మహాలే సినిమాటోగ్రఫీ అందించారు. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, ఇలియాన్ డిక్రూజ్ మొదలైన వారిని సంప్రదించారట.

అయితే డేట్స్ కుదరకపోవడంతో ఆఖరికి శ్రద్ధా కపూర్‌‌ను ఎంపిక చేశారట. అక్షయ్ కుమార్‌ కథానాయకుడిగా తెరకెక్కిన "టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ" చిత్రానికి దర్శకత్వం వహించిన నారాయణ్ సింగ్ ఈ చిత్రానికి డైరెక్షన్ వహించడం గమనార్హం. ది వెడ్నెస్డే, స్పెషల్ 26, బేబి, రుస్తుం లాంటి సినిమాలకు నారాయణ్ సింగ్ గతంలో ఎడిటర్‌గా పనిచేశారు. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close