యూట్యూబ్‌ వేదికగా వంట చేస్తూ.. డబ్బులు సంపాదిస్తున్నారు...!

వంట చేయడం అనేది కూడా ఒక కళే. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వంట మాస్టర్లకు వరంగానే మారిందని చెప్పవచ్చు. తమకు వచ్చిన వంటకాలు చేయడంతో పాటు కొత్తగా ప్రయోగాలు చేస్తూ కూడా వీరు డబ్బులు గడిస్తున్నారు.

Updated: Jun 7, 2018, 04:54 PM IST
యూట్యూబ్‌ వేదికగా వంట చేస్తూ.. డబ్బులు సంపాదిస్తున్నారు...!

వంట చేయడం అనేది కూడా ఒక కళే. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ వంట మాస్టర్లకు వరంగానే మారిందని చెప్పవచ్చు. తమకు వచ్చిన వంటకాలు చేయడంతో పాటు కొత్తగా ప్రయోగాలు చేస్తూ కూడా వీరు డబ్బులు గడిస్తున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలు చేసేవారికి యూట్యూబ్‌లో దక్కుతున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. కేవలం ఇలాంటి వంటల వీడియోలను ప్రోత్సహించే ఫ్యాన్ క్లబ్బులు, అభిమాన సంఘాలు కూడా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మరి మనం కూడా వంట మాస్టర్లలో బాగా పాపులారిటీ దక్కించుకున్న కొందరు యూట్యూబ్ సెలబ్రిటీల గురించి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ గురించి తెలుసుకుందామా..

విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన గోపినాథ్ అనే ఇంజనీరింగ్ కుర్రాడు, తన తండ్రి ఆర్ముగం వంట చేస్తుండగా తీసిన వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి డబ్బులు 
సంపాదించడం ప్రారంభించాడు. దాదాపు గోపినాథ్ రూపొందించిన 42 వీడియోలు 30 మిలియన్ వ్యూస్ సంపాదించడం విశేషం. ఆర్ముగం తయారు చేసే వంటలను "విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరీ"పేరుతో ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలకు ప్రాధాన్యమివ్వడం ఈ ఛానల్ స్పెషాలిటీ. చికెన్ బిర్యానీ, కేఎఫ్‌సీ చికెన్, మటన్ పులావ్, రొయ్యల ఇరుగు, చేపల పులుసు.. ఒక్కటేమిటి ఏ వంట చేయడంలోనైనా ఆర్ముగం దిట్టే. ఈ ఛానెల్ ద్వారా ఆరు నెలల్లో ఆరు లక్షల సంపాదించారట గోపినాథ్ సన్నాఫ్ ఆర్ముగం.

Pic Courtesy: Facebook/Village Food Factory                                             

గ్రాండ్ పా కిచెన్
విలేజ్ ఫుడ్ ఫ్యాక్టరిని పోలిన మరో ఛానల్ పేరే గ్రాండ్ పా కిచెన్. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రీకాంత్ రెడ్డి తన తండ్రి నారాయణ రెడ్డి సహాయంతో ఈ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్‌కి ఒక ఫేస్ బుక్ పేజీ కూడా ఉంది. ఈ పేజీలో దాదాపు 2 లక్షలకు పైగానే ఫాలోవర్లు ఉన్నారు. హాట్ డాగ్స్‌తో పాటు, చీజ్ స్టిక్స్, డోనట్స్ లాంటి వెస్టర్న్ స్టైల్ వంటకాలను కూడా చేయడం  గ్రాండ్ పా స్పెషాలిటీ.

Pic Courtesy: Facebook/GrandPa Kitchen

కంట్రీ ఫుడ్స్
గుంటూరు జిల్లాలోని గుడివాడ ప్రాంతానికి చెందిన 105 సంవత్సరాల మస్తానమ్మ చేసే వంటకాలను ఆమె మనవడు లక్ష్మణ్ యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. ఆ వీడియో ఛానల్‌కి "కంట్రీ ఫుడ్స్" అని పేరు పెట్టారు. ఈ ఛానల్ అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకుంది. బాంబూ చికెన్, వాటర్ మెలన్ చికెన్ లాంటివి తయారుచేయడంలో మస్తానమ్మ దిట్ట. ఈ ఛానల్‌‌‌కి అమెరికా, ఇంగ్లాండ్, యూఏఈ, పాకిస్తాన్ లాంటి దేశాల నుండి కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. 

Pic Courtesy: Facebook/Country Foods

మైనా స్ట్రీట్ ఫుడ్
మైనా స్ట్రీట్ ఫుడ్ పేరుతో కూడా కొందరు ఔత్సాహికులు ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా ఓ ముసలావిడ రకరకాలు దేశీయ వంటలు చేస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. 

Pic Courtesy: Facebook/Myna Street Food

దేశీ కిచెన్
హైదరాబాద్ మెట్‌‌పల్లి ప్రాంతానికి చెందిన మరో గ్రాండ్ మా చేస్తున్న వంటకాలను ఎవరో "దేశీ కిచెన్" పేరుతో యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. అనతికాలంలోనే ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మంచి పాపులారిటీనే సంపాదించుకుంది. కీమా బిర్యానీ, స్పాంజి కేక్ లాంటివి తయారుచేస్తూ ఈ ఛానల్‌లోని గ్రాండ్ మా కూడా మంచి అభిమానులనే సంపాదించుకోవడం విశేషం. 

Pic Courtesy: Facebook/Desi Kitchen

మంజులాస్ కిచెన్
ఉత్తరాదికి చెందిన ప్రముఖ ఇండియన్ చెఫ్ తాను చేసే రకరకాల వంటకాల తయారీ వీడియోలతో రూపొందించిన ఛానల్ "మంజులాస్ కిచెన్". ఈ ఛానల్ ఎక్కువ కుకింగ్ ట్యుటోరియల్ ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగపడడం విశేషం. చాలా సులభమైన పద్ధతిలో వంటకాలు ఎలా తయారుచేయాలో ఈ ట్యుటోరియల్స్ ద్వారా మంజులా జైన్ ఔత్సాహికులకు కొన్ని టిప్స్ ద్వారా వీడియోల్లో తెలియజేస్తుంటారు. 

ఇతర ఛానల్స్
ఇవే కాక ఇంకా ఎన్నో వంటకాల ఛానల్స్ యూట్యూబ్‌లో ఫుడ్ లవర్స్‌కు కనువిందు చేస్తున్నాయి. ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ ఛానల్‌తో పాటు నిషా మధులిక, చింగ్రీ మలైకరి, బేటి కలియా, సంజయ్ తుమ్మ లాంటి వారు నిర్వహిస్తున్న ఛానల్స్ కూడా ఎంతో పాపులారిటీని కైవసం చేసుకున్నాయి.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close