హీరో ప్రభాస్‌కి ఛాలెంజ్ విసిరిన తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ హరితాహారం పథకంలో భాగంగా సినీ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత దిల్ రాజు మొదలైన వారికి "గ్రీన్ ఛాలెంజ్" విసిరారు.

Last Updated : Aug 10, 2018, 09:11 PM IST
హీరో ప్రభాస్‌కి ఛాలెంజ్ విసిరిన తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ హరితాహారం పథకంలో భాగంగా సినీ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత దిల్ రాజు మొదలైన వారికి "గ్రీన్ ఛాలెంజ్" విసిరారు. హరితహారం నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నలుగురికీ ఆదర్శంగా నిలవమని కోరుతూ మంత్రి ఈ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్‌ను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ నుండి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు.

ఇటీవలి కాలంలో తెలంగాణలో "గ్రీన్ ఛాలెంజ్" చాలా పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సచిన్ టెండుల్కర్, ఎస్ ఎస్ రాజమౌళి, కేటీఆర్ లాంటి వారందరూ ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు కూడా నాటారు. తాజాగా ఈ ఛాలెంజ్ విసిరిన తలసాని మాట్లాడుతూ " హరితహారం పేరుతో సీఎం చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణవ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటాం. భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందించే బాధ్యత మ‌న‌మీదే ఉంది. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి" అని తెలిపారు.

హరితహారం అనేది  తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. హరితహారం పథకం 2015లో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేత అధికారికంగా ప్రారంభించబడింది. తెలంగాణలో రాష్ట్రం మొత్తం మొక్కలను నాటి, పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. 2016లో ఈ కార్యక్రమంలో భాగంగా 46 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. హైదరాబాద్ నగరంలో కూడా ఒక్కరోజులోనే దాదాపు 25 లక్షల మొక్కలు నాటారు. ఒకేరోజు లక్షమంది 163 కిలోమీటర్ల పొడవునా నిలబడి మొక్కలు నాటి రికార్డు సృష్టించడం జరిగింది.

Trending News