ఆ అమ్మాయిల కష్టాన్ని చూసి.. రూ.19 లక్షల పీఎఫ్ డబ్బును దానం చేసేశాడు

రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి అనేది చాలా వెనుకబడిన గ్రామం. ఆ గ్రామ పరిసర గ్రామాలైన రామ్ నగర్, భోపాల్ పూర్ లాంటి ప్రాంతాలు కూడా చాలా వెనుకబడిన ప్రాంతాలే.

Last Updated : Oct 29, 2018, 04:40 PM IST
ఆ అమ్మాయిల కష్టాన్ని చూసి.. రూ.19 లక్షల పీఎఫ్ డబ్బును దానం చేసేశాడు

రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి అనేది చాలా వెనుకబడిన గ్రామం. ఆ గ్రామ పరిసర గ్రామాలైన రామ్ నగర్, భోపాల్ పూర్ లాంటి ప్రాంతాలు కూడా చాలా వెనుకబడిన ప్రాంతాలే. ఆ ఊర్లకు బస్సు సౌకర్యం లేదు. అందుకే ఆడపిల్లలు కాలేజీకి వెళ్లాలంటే నడిచే వెళ్తారు. ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా.. కరుణించే నాధుడే లేడు. నడిచి కాలేజీకి వెళ్తున్న ఆడపిల్లలకు ఆకతాయీల బెడద కూడా ఎక్కువే. అందుకే కొందరు పిల్లలను చదువు మానిపించేశారు. కొన్ని కుటుంబాలు పిల్లలను వేరే ఊరికి పంపించి చదివించాలని భావించేవి. ఆ మాత్రం స్థోమత లేని వారికి మళ్లీ కాలినడక ప్రయాణమే దిక్కు.

ఆ ఆడపిల్లల బాధను గమనించిన అదే ఊరికి చెందిన ఓ ప్రభుత్వ డాక్టర్ ఆర్పీ యాదవ్ ఓ నిర్ణయం తీసుకున్నారు. తాను రిటైర్ అయ్యాక బ్యాంకులో వేసిన రూ.20 లక్షల రూపాయలను బయట తీశారు. అందులో రూ.19 లక్షల రూపాయలను ఖర్చు పెట్టి ఓ బస్సును కొన్నారు. ఆ బస్సుకు ఒక డ్రైవర్‌ని కూడా రిక్రూట్ చేశారు. కోట్ పుత్లి, రామ్ నగర్, భోపాల్ పూర్ ప్రాంతాలలోని పేద విద్యార్థినులు ఆ బస్సు ద్వారా కాలేజీకి ఉచితంగా వెళ్లే సౌకర్యాన్ని కల్పించారు. ఇప్పుడు యాదవ్ పేరు ఆ ఊర్లలో మారుమ్రోగిపోతోంది. 

1976లో యాదవ్ దంపతులు హేమలత అనే ఒక అమ్మాయికి జన్మనిచ్చారు. ఆరునెలలకే ఆ బాలిక మరణించింది. తర్వాత వారికి సంతానం కలగలేదు. తాము ఎంత డబ్బు సంపాదిస్తున్నా.. ఏదో వెలితి జీవితంలో ఉండేదని.. తమకూ ఓ బిడ్డ ఉంటే తన చదువుకి, వివాహానికి డబ్బు పొదుపు చేసే ఉండే వాళ్లం కదా .. అని ఆ దంపతులు అనుకొనేవారట. కానీ తమకు ఆ అదృష్టం లేనందుకు బాధపడేవారట. కానీ.. ఓ రోజు తమకు ఓ అయిదుగురు ఆడపిల్లల చదువుకు సహాయపడే అవకాశం వచ్చిందని ఈ దంపతులు తెలిపారు.

అయితే వారు చదువు మానేయాలని భావించారని.. అందుకు కారణం ఆ గ్రామంలో సరైన రవాణా సదుపాయం లేకపోవడమేనని వారు చెప్పారని యాదవ్ అన్నారు. ఆ మాటలు విని తమకు ఎంతో బాధేసిందని.. వారి మాటలు గుండెలు పిండేశాయని.. అందుకే ఆ బాలికలతో పాటు ఆ గ్రామం నుండి పట్టణానికి చదువుకోవడానికి వెళ్తున్న 40 మంది పేద విద్యార్థినుల కోసం అంత ఖరీదు పెట్టి బస్సుని కొన్నామని తెలిపారు యాదవ్ దంపతులు. ఆ బస్సుకి "నిషుల్క బేటీ వాహిని" అని కూడా పేరు పెట్టారు.

Trending News