తిరుమల తిరుపతి గురించి ఆసక్తికర విశేషాలివే

తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి అనేకమంది భక్తులు ప్రతీ రోజూ వస్తుంటారన్న సంగతి మనకు తెలిసిందే. 

Updated: Aug 5, 2018, 06:27 PM IST
తిరుమల తిరుపతి గురించి ఆసక్తికర విశేషాలివే

తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి అనేకమంది భక్తులు ప్రతీ రోజూ వస్తుంటారన్న సంగతి మనకు తెలిసిందే.  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్వహించే టీటీడీ ఓ స్వతంత్ర సంస్థ. ప్రస్తుతం దాదాపు 15000 మందికి పైగానే ఉద్యోగులు టీటీడీలో పనిచేస్తున్నారు. దాదాపు వీరి పర్యవేక్షణలో 12 ఆలయాలు ఉన్నాయి. ప్రపంచ రికార్డుల్లోనే కనివినీ ఎరుగని స్థానాన్ని సొంతం చేసుకున్న శ్రీవారి ఆలయం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీకు ఈ రోజు ప్రత్యేకం

*మన దేశంలో 1925 కోట్ల వార్షిక బడ్జెట్‌ కలిగిన ఏకైక ఆలయం శ్రీవారి ఆలయం.

*1830 సంవత్సరం నాటికే తిరుమలలో భక్తులు చెల్లించే డబ్బు, కానుకల నుంచి ఈస్టిండియా కంపెనీ వారికి సంవత్సరానికి రూ.లక్ష వరకు పన్ను రూపేణా ఆదాయం వచ్చేది.

*తిరుమలలో సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో కూడా.. చాలా సులువైన రీతిలో భక్తులకు దర్శన సౌకర్యాన్ని కల్పించడానికి టీటీడీ తొలి ఈవో చెలికాని అన్నారావు చేసిన కృషి మరువలేనిది

*తిరుమలలో ప్రతీ రోజు భక్తులకు వినబడే వెంకటేశ్వర సుప్రభాతం ఆలపించిన ఘనత మహా గాయని ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి గారికి మాత్రమే దక్కింది. 

*1983లో స్వర్గీయ ఎన్టీ.రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత భక్తుల సౌకర్యార్థం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నిర్మించారు

*తిరుమలలో ప్రారంభించిన దళిత గోవిందం పథకంలో భాగంగా స్వామి చెంతకు చేరుకోలేని వారందరికోసం ఆయనే వాడవాడలా పర్యటించే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. 

*15 వందల ఏళ్ల నుండి తిరుమల, చక్రవర్తులు, పాలకుల ఆదరణకు నోచుకుంటూ వస్తోంది. క్రీ.శ.614. పల్లవ రాణి సామవై కాలంలో ఆనంద నిలయాన్ని తిరుమలలో ప్రారంభించారు

*తిరుమల వెంకటేశ్వస్వామి గుడిలో దాదాపు 11 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నట్లు సమాచారం. 

*స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌ అనే ముస్లిం సమర్పించడం విశేషం.

*తిరుమలలో శ్రీవారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో ఈ తిరుప్పావడ జరుగుతుంది. అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, దోసె, పాయసం, జిలేబి తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు.