'అజ్ఞాతవాసి' నిర్మాతలకు లీగల్ నోటీసులు

'అజ్ఞాతవాసి' కథను తన సినిమా ‘లార్గో వించ్’ కథ లైన్ నుంచి తీసుకున్నారని ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోమ్ సలే ఆరోపించిన సంగతి విదితమే.

Updated: Feb 11, 2018, 03:24 PM IST
'అజ్ఞాతవాసి' నిర్మాతలకు లీగల్ నోటీసులు

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'అజ్ఞాతవాసి' సినిమాకు ఇబ్బందులు తప్పేలాలేవు. కథను తన సినిమా ‘లార్గో వించ్’ కథ లైన్ నుంచి తీసుకున్నారని ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోమ్ సలే ఆరోపించిన సంగతి విదితమే. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌లో కూడా ఆయన ట్వీట్ చేశారు.

అయితే ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ‘అజ్ఞాతవాసి’ విషయంలో తనకు వివరణ ఇవ్వాలని సినీ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపానని, ఆ నోటీసులపై ఇంతవరకూ సమాధానం రాలేదని జెరోమ్ చెప్పాడు. అవసరమైతే టి-సిరీస్ కు (2008 లో ఫ్రెంచ్ చిత్రం రీమేక్ హక్కులు సొంతం చేసుకుంది) కూడా లీగల్ నోటీసు పంపించడానికి సలే సిద్ధంగా ఉన్నాడు. "నేను చట్టప్రకారం దాఖలు చేశాను. నాకు భారతీయ సినిమాలపై చాలా గౌరవం ఉంది. కానీ నేను నా పనిని గౌరవిస్తాను, వారు దానిని గౌరవిస్తారనుకుంటాను" అని చెప్పాడు.

ఈ వ్యవహారాన్ని మరింత సీరియస్‌గా తీసుకోనున్నట్లు జెరోమ్ చెప్పాడు. సినీ నిర్మాతల నుంచి స్పష్టమైన జవాబు వచ్చే వరకూ ‘అజ్ఞాతవాసి’ చిత్రం విషయంలో వెనక్కి తగ్గేది లేదని జెరోమ్ సలే తెలిపాడు. 'మేము ఫ్రెంచ్ ఫిలిం రైట్స్ కలిగి ఉన్నామని, అజ్ఞాతవాసి నిర్మాతలు కాపీరైట్ ఉల్లంఘన చేసినట్లయితే, చట్టప్రకారమే ముందుకు వెళతాం' అని టి-సిరీస్ ఒక పత్రికకు వెల్లడించింది.