శ్రీ రెడ్డికి లీగల్ నోటీసులతో వార్నింగ్ ఇచ్చిన నాని

నటి శ్రీ రెడ్డికి లీగల్ నోటీసులు

Updated: Jun 13, 2018, 07:01 PM IST
శ్రీ రెడ్డికి లీగల్ నోటీసులతో వార్నింగ్ ఇచ్చిన నాని

నటి శ్రీ రెడ్డికి లీగల్ నోటీసులు పంపిస్తూ ఆమెకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు న్యాచురల్ స్టార్ నాని. బిగ్ బాస్ 2 సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాని కావాలనే దురుద్దేశంతో తనని బిగ్ బాస్ షోలో పాల్గొనకుండా చేశాడని అతడిపై శ్రీరెడ్డి అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ 2 షో ప్రారంభం కన్నా ముందు నుంచే నాని వ్యక్తిత్వం గురించి, అతడి వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ శ్రీరెడ్డి ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ పరిణామాలన్నింటినీ తీవ్రంగా పరిగణించిన నాని నిన్న సోమవారం తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. శ్రీ రెడ్డి సోషల్ మీడియా పోస్టులు, ఆమె కామెంట్స్ తన క్లయింట్ పరువును బజారుకీడుస్తున్నాయని, ఇకనైనా తీరు మార్చుకుని వారం రోజుల్లోగా తన క్లయింట్‌కి బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే, చట్టపరమైన చర్యలకు పూనుకోవాల్సి ఉంటుందని నాని తరపు న్యాయవాది ఆ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. 

 

శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా తన క్లయింట్ ఎన్నో అవకాశాలు కోల్పోవాల్సి రావడమే కాకుండా మానసికంగా క్షోభకు గురయ్యారని నాని తరపు న్యాయవాది ఆ నోటీసుల్లో స్పష్టంచేశారు. ఈ లీగల్ నోటీసులు పంపించిన విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించిన నాని.. సహనానికైనా ఓ హద్దు ఉంటుందని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా కొంతమంది చీప్ పబ్లిసిటీ కోసం చేసే ఇటువంటి వ్యాఖ్యలపై తాను ఇకపై స్పందించదల్చుకోలేదని నాని స్పష్టంచేశారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close