ఎన్టీఆర్ బయోపిక్: కీలక పాత్రలో రానా?

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ఎన్టీఆర్.

Updated: May 17, 2018, 03:30 PM IST
ఎన్టీఆర్ బయోపిక్: కీలక పాత్రలో రానా?

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం 'ఎన్టీఆర్'. ఈ సినిమాలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గతనెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. కానీ అనూహ్యంగా దర్శకుడు తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. డైరెక్టర్ రాఘవేంద్ర రావు, క్రిష్ తదితరులను సంప్రదించినా డైరెక్టర్ విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చారు. ఈ సమయాన్ని వృధా చేయకుండా మూవీ యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది.

ఈ క్రమంలోనే నిర్మాతలు రానా దగ్గుబాటిని కలిశారట. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానాను కలిశారని టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించనుంది.

'నిర్మాతలు రానా దగ్గబాటితో కలసి పాత్ర గురించి చర్చించారు. రానా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తిని కనబరిచారు. ఇంకా డిస్కషన్ స్టేజీలో ఉంది. రానా నుంచి వారంలోపు కన్ఫర్మేషన్ రావచ్చు' అని నివేదికలు తెలిపాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న భారీ ప్రకటన చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. డైరెక్టర్ ఎవరనేది కూడా అప్పడే ప్రకటిస్తారని సమాచారం.

ప్రాజెక్ట్ నిర్మాత విష్ణు ఇందూరి మాట్లాడుతూ, విద్యాబాలన్ డేట్స్ కన్ఫర్మ్స్ చేశారని, జూలై నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని అన్నారు. సినిమా గురించి ఏమీ మాట్లాడలేనని, సంక్రాంతి 2019లో సినిమా విడుదలవుతుందని స్పష్టం చేశారు.