ఉగాది పచ్చడి ప్రాముఖ్యత, ఆరోగ్య సమాచారం

''ఉగాది పచ్చడి'' ఉగాది పండుగకు ప్రత్యేకమైంది. పచ్చడి తయారీలో వేప ప్రత్యేకమైనది.. చాలా ముఖ్యమైనది. ఎన్నో లాభాలు ఉగాది పచ్చడితో ఉన్నాయి.

Updated: Mar 19, 2018, 12:04 AM IST
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత, ఆరోగ్య సమాచారం

ఉగాది.. తెలుగు ప్రజలు జరుపుకునే పండుగలలో ప్రముఖమైంది. ఇది తెలుగువారి మొదటి పండగ. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ పండుగను కర్నాటక ప్రజలు కూడా జరుపుకుంటారు.  

''ఉగాది పచ్చడి'' ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరురుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.

ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.  పచ్చడి తయారీలో వేప ప్రత్యేకమైనది.. చాలా ముఖ్యమైనది. వేప చెట్టుకి  ఔషధ గుణాలు చాలా ఉన్నాయి.కొందరు దీనిని "ఫార్మసీ ఆఫ్ ది విలేజ్" గా పిలుస్తారు. ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం!

కావాల్సిన పదార్థాలు: వేపపువ్వు- తగినంత, చిన్న చెరుకు ముక్క - ఒకటి, చిన్న కొబ్బరి ముక్క -ఒకటి, అరటిపళ్లు- రెండు, చింతపండు - తగినంత, చిన్న మామిడికాయ- ఒకటి, బెల్లం- 100 గ్రాములు, పచ్చి మిరపకాయ - ఒకటి, ఉప్పు- తగినంత, నీళ్లు - సరిపడా.

తయారీ విధానం: ముందుగా చెరుకు, కొబ్బరి, బెల్లం, మిర్చి, మామిడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని పెట్టుకోవాలి. వేప పువ్వును శుభ్రంగా కడిగి రేకుల్నితీసి పెట్టుకోవాలి. తగినన్ని నీళ్లలో చింతపండును బాగా కలిపి తీసిన పుల్లటి నీటిని చిన్న గిన్నెలో పోయాలి. అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చిటికెడు ఉప్పు, చెరకు, కొబ్బరి, మిర్చి, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా అరటిపండు ముక్కలు వేయాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ.!

ఉగాది పచ్చడి ఆరోగ్యం సమాచారం:

*బాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తొలగుతాయి.

*జీర్ణాశయం,శరీరం శుభ్రమవుతుంది.

*చర్మ సమస్యలను దూరం చేస్తుంది.

*వేసవి వాతావరణానికి తగ్గట్టు శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

*బెల్లంతో శరీరంలోకి ఐరన్ పెరుగుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉగాది పచ్చడితో ఉన్నాయి. మన పెద్దలు ఏదీ ఊరికే చెప్పరు. పాటించకపోతే ఏమవుతుంది అనేకంటే.. పాటిస్తే నష్టం ఉండదు కదా..!

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close