'గుండెపోటు'ను ముందే గుర్తించవచ్చు

రక్తంలో ఉండే ఎఫ్ఏబిపి3 అనే చిన్న ప్రోటీన్ ను ఉపయోగించి గుండె పోటును ముందే గుర్తించవచ్చు.

Updated: Feb 21, 2018, 02:09 PM IST
'గుండెపోటు'ను ముందే గుర్తించవచ్చు

గుండె పోటు వచ్చిన వ్యక్తికి తొందరగా చికిత్స చేస్తే బతికే అవకాశాలు ఎక్కువ. కానీ ఆ మాయదారి రోగం ఎప్పుడు ఠక్కున వస్తోందో చెప్పలేం. కానీ తాను కనుక్కున్న ఓ పరికరం ద్వారా ఇట్టే ఆ ప్రమాదాన్ని పసిగట్టవచ్చు అంటున్నాడు ఆకాష్.

ఆకాష్ పూర్తిపేరు ఆకాష్ మనోజ్.  ఇతనికి 16 సంవత్సరాలు. తమిళనాడులోని ఒక స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. సాధారణంగా ఈ తరగతి పిల్లలు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. కానీ ఈ పిల్లవాడు గుండె ప్రమాదాన్ని గుర్తించే పరికరాన్ని కనిపెట్టి బంగారు పతకం సాధించాడు. 'ఇన్నోవేషన్ స్కాలర్స్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాం' క్రింద రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ పతాకాన్ని అందుకున్నాడు ఆకాష్.

ఆ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ- " ఆరోగ్యంగా కనిపించే మా  తాతయ్య ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. నిశ్శబ్దంగా వచ్చే ఆ గుండెపోట్లను ముందే కనిపెట్టే పరికరం తయారుచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అందులో భాగంగానే ఈ పరికరాన్ని తయారు చేశా. రక్తంలో ఉండే ఎఫ్ఏబిపి3 అనే చిన్న ప్రోటీన్‌ను ఉపయోగించి గుండె పోటును ముందే గుర్తించవచ్చు . ఇంకా దీనిని అభివృద్ధి చేయాలి. శరీరంపై గాటు పడకుండా దీనిని వాడుకోవచ్చు" అని ఆ పరికరాన్ని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శిస్తూ పేర్కొన్నాడు. ముఖ్యంగా గ్రామాల్లో ఉండేవారికి ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని ఆకాష్ తెలిపాడు.