తమిళనాడులో 1600 ఖైదీలకు విముక్తి

తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్ర జైళ్ళల్లో మగ్గిపోతున్న 1600 మంది యావజ్జీవ ఖైదీలకు విముక్తి ప్రసాదించాలని భావిస్తోంది.

Updated: Jan 13, 2018, 01:39 PM IST
తమిళనాడులో 1600 ఖైదీలకు విముక్తి

తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్ర జైళ్ళల్లో మగ్గిపోతున్న 1600 మంది యావజ్జీవ ఖైదీలకు విముక్తి ప్రసాదించాలని భావిస్తోంది. జనవరి 17వ తేదిన జరిగే ఎంజీఆర్ జయంతితో పాటు ఫిబ్రవరి 25వ తేదిన జరిగే జయలలిత జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2008లో తొలిసారిగా డీఎంకే ప్రభుత్వం 1405 ఖైదీలను విడుదల చేయడం గమనార్హం.

ఈసారి దాదాపు 1900 మంది ఖైదీలను విడుదల చేయాలని జైళ్ళ శాఖ సిఫార్సు చేసినప్పటికీ.. ప్రభుత్వం 1600 మందికి మాత్రమే అనుమతి అందించింది. ఈ విషయానికి సంబంధించి త్వరలోనే అధికారిక సమాచారం రానుంది. ప్రస్తుతం తమిళనాడులో 9 సెంట్రల్ జైళ్ళతో పాటు 3 మహిళా జైళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పటికే జైళ్ళ నుండి విడుదలై మంచి మార్గంలో జీవించాలని భావించే ఖైదీలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో తమిళనాడు జైళ్ళ శాఖ పలు కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం విశేషం.