48 బస్సులు ధ్వంసం, 150మందికిపైగా అరెస్ట్

కొరేగావ్-భీమా హింసకు నిరసనగా మహారాష్ట్రలో దళిత సంఘాలు తలపెట్టిన బంద్ హింసాత్మకంగా మారి విధ్వంసానికి దారితీసింది.

Last Updated : Jan 4, 2018, 09:41 AM IST
48 బస్సులు ధ్వంసం, 150మందికిపైగా అరెస్ట్

కొరేగావ్-భీమా హింసకు నిరసనగా మహారాష్ట్రలో దళిత సంఘాలు తలపెట్టిన బంద్ హింసాత్మకంగా మారి విధ్వంసానికి దారితీసింది. దీంతో బుధవారం మహారాష్ట్రలోని అనేక చోట్ల జనజీవనం స్థంబించిపోయింది. కోరేగావ్-భీమా హింసను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సైతం పలు చోట్ల రవాణా సేవల్ని నిలిపేసింది. ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్, గోరేగావ్, దాదార్, మలాడ్ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనల మధ్యే పలుచోట్ల సబర్బన్ సర్వీసుల ద్వారా సేవలు అందించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. లోకల్ ఏసీ రైలు సేవల్ని రద్దు చేసినప్పటికీ, దూర ప్రాంతాలకి రాకపోకలు సాగించే రైలు సేవలు యధావిధిగా కొనసాగాయి. 

 

ఈ బంద్ కారణంగా నేడు ముంబైలో చెలరేగిన అల్లర్లలో బృహత్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) సంస్థ నిర్వహిస్తోన్న 48 బస్సులు ధ్వంసం అయ్యాయి. నిరసనకారుల దాడుల్లో నలుగురు డ్రైవర్లు గాయపడ్డారు. దీంతో హింసాత్మక ఘటనలకి కారణమైన 150మందికిపైగా నిరసనకారులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

ముంబైలో హింస కారణంగా సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు పెంచిన పోలీసులు.. రద్దీగా వుండే వివిధ మార్గాల్లో ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని సమీక్షించారు. అదే సమయంలో ముంబై వాసులు సమస్యాత్మక ప్రాంతాల వైపు వెళ్లకుండా రద్దీ లేని మార్గాల్లో తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిందిగా సూచిస్తూ ట్విటర్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆ సమాచారాన్ని వెల్లడించారు. 

 

Trending News