సొంత భార్య చేతిలో హత్యకు గురైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

పంజాబ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత హర్విందర్ సింగ్ హిందాను సొంత భార్యే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Updated: Sep 13, 2018, 10:17 PM IST
సొంత భార్య చేతిలో హత్యకు గురైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

పంజాబ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత హర్విందర్ సింగ్ హిందాను సొంత భార్యే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హర్విందర్‌ని హత్య చేసిన ఆయన భార్యను ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ హత్యకేసులో వ్యక్తిగత కక్షలే ప్రధాన కారణమని.. రాజకీయ పరమైన కారణాలు ఏమీలేవని పోలీసులు స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీ చేస్తున్న క్రమంలో ఆయనపై కక్ష గట్టి కాంగ్రెస్ నేతలే హత్య చేసి ఉండవచ్చని.. ఈ విషయంలో దర్యాప్తును పకడ్బందీగా చేయాలని మరో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హర్పాల్ సింగ్ చీమా చేసిన వ్యాఖ్యలను పోలీసులు తోసిపుచ్చారు. తమ దర్యాప్తులో అలాంటిదేమీ లేదని తేలిందని చెప్పారు. నామినేషన్ పేపర్లు ఫైల్ చేసిన కొద్ది రోజుల్లోనే ఆప్ అభ్యర్థి హత్యకు గురవ్వడంతో గిల్ ఖిలాన్ జిల్లా పరిషత్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఆప్ అభ్యర్థులను భయపెట్టే విధంగా పలు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని కొందరు ఆప్ నేతలు పోలీసులకు తెలిపారు. హర్విందర్ హత్యకు సంబంధించిన దర్యాప్తును ముమ్మురం చేసి కారకులను అదుపులోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఆప్ నేతల వాదనను తోసిపుచ్చారు.గత ఆదివారం రాత్రి ఆప్ అభ్యర్థి హర్విందర్ సింగ్ హిందా దారుణమైన హత్యకు గురయ్యారు. ఆయన గిల్ కిలాన్ జిల్లా పరిషత్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పంజాబ్‌లో జిల్లా పరిషత్, పంచాయితీ సమితి ఎన్నికలు సెప్టెంబరు 19వ తేదిన జరగనున్నాయి. కౌంటింగ్ సెప్టెంబరు 22వ తేదిన జరుగుతుంది. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close