సాధారణ కార్యకర్త స్థాయి నుంచి.. దేశం మెచ్చిన నాయకుడి రాజకీయ ప్రస్థానం ఇదే

Last Updated : Aug 16, 2018, 10:16 PM IST
సాధారణ కార్యకర్త స్థాయి నుంచి.. దేశం మెచ్చిన నాయకుడి రాజకీయ ప్రస్థానం ఇదే

దేశం మెచ్చిన మాజీ ప్రధాని, మృధు స్వభావి అటల్ బిహారి వాజ్ పేయి ఇక లేరు. 93 ఏళ్ల వయస్సులో తీవ్ర అనారోగ్యానికి గురైన వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం అందరికీ ఇక సెలవు అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మన మధ్య లేకపోయినా... ఆయన చూపిన సన్మార్గం, ఆయన ఆచరించిన ఆదర్శపు జీవితం అందరికీ స్పూర్తిగా నిలుస్తుంది. రాజకీయాల్లోకి రావాలనుకునే భవిష్యత్ తరాలకు బాటలు వేస్తుంది. ఇంతకీ అటల్ బిహారి వాజ్‌పేయిని అందరివాడిగా తీర్చిదిద్దిన ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది ? ఎలా దేశానికి నాయకుడిని చేసిందో తెలుసుకోవాలంటే, వాజ్‌పేయి రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకోవాల్సిందే. ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అనతికాలంలోనే ఎవ్వరికీ అందనంత స్థాయికి ఎదిగారు. 1924 డిసెంబర్‌ 25న గ్వాలియర్‌లో జన్మించిన వాజ్‌పేయి.. యవ్వనప్రాయంలోనే రాజకీయాల పట్ల ఆసక్తి కనబర్చారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో పీజీలోనూ పొలిటికల్‌ సైన్స్‌నే ఎంచుకుని పీజీ పట్టభద్రుడయ్యారు. 

బలరాంపూర్ నుంచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన అటల్ బిహారి వాజ్‌పేయి:
స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా 1947లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్విట్‌ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని 23 రోజులపాటు జైలు జీవితం గడిపారు. 1951లో అప్పటి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించడంతో భారతీయ జన సంఘ్‌ ఏర్పాటు చేయడంలో వాజ్‌పేయి కీలకపాత్ర పోషించారు. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ప్రియశిష్యుడిగా రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారు. మొట్టమొదటిసారిగా 1957లో లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన వాజ్‌పేయి ఉత్తర్ ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 

వాజ్‌పేయి రాజకీయ ప్రస్థానాన్ని మలుపు తిప్పిన ఘట్టం:
1968లో భారతీయ జన సంఘ్‌ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం వాజ్‌పేయి రాజకీయ ప్రస్థానాన్ని కీలక మలుపు తిప్పింది. 1975లో ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో ఇందిరా గాంధీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపట్టి అప్పటి కేంద్ర సర్కార్ ఆగ్రహానికి గురయ్యారు. అనంతరం 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించడంలో వాజ్‌పేయి కీలక పాత్ర పోషించారు. 

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా..
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసిన వాజ్ పేయి.. విదేశాలతో భారత్ సత్సంబంధాలు మెరుగు పడటానికి ఎంతో కృషిచేశారు. బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ, షెకావత్‌తో కలిసి 1980లో భారతీయ జనతాపార్టీ స్థాపించినప్పటికీ ఆ తర్వాత 1984లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం రెండు లోక్‌సభ సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 

తొలిసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన వేళ: 
1996 లోక్ సభ ఎన్నికలకన్నా ఒక ఏడాది ముందుగా అటల్ బిహారి వాజ్‌పేయిని బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థిగా నిలబెడుతున్నట్టు అడ్వాణీ ఓ ప్రకటన చేశారు. 1996 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో వాజ్‌పేయి తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, కొన్ని అనూహ్య పరిణామాలతో వాజ్‌పేయి మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో 13 రోజుల వ్యవధిలోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అనంతరం బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు కాగా 1999-2004లో ఐదేళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వానికి రథసారధిగా, దేశ ప్రధానిగా ఆయన అందరి మన్ననలు అందుకున్నారు. 

Trending News