ఆ ప్రేమ ఖరీదు.. రూ.60 లక్షలు

ప్రేమ పేరుతో ప్రలోభపెట్టి ఓ యువ వ్యాపారవేత్త నుండి రూ.60 లక్షలను ఓ అందమైన భామ కొల్లగొట్టిన ఘటన తాజాగా బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. 

Updated: Apr 15, 2018, 11:03 PM IST
ఆ ప్రేమ ఖరీదు.. రూ.60 లక్షలు

ప్రేమ పేరుతో ప్రలోభపెట్టి ఓ యువ వ్యాపారవేత్త నుండి రూ.60 లక్షలను ఓ అందమైన భామ కొల్లగొట్టిన ఘటన తాజాగా బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఓ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి ఆన్‌‌లైన్ డేటింగ్ సైట్ ద్వారా తన జీవిత భాగస్వామిని పొందాలని అనుకున్నాడు. అందుకే ఆ సైట్‌లో పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ క్రమంలోనే ఆయనకు అదే డేటింగ్ సైటులో ఓ అందమైన అమ్మాయి పరిచయమైంది.

ఆమె తనను కూడా ఓ పెద్ద కంపెనీకి ఎండీగా పరిచయం చేసుకుంది. అంతే కాదు.. ఆ అబ్బాయి భావాలు నచ్చాయని.. ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తర్వాత చాలా రోజులు వారి మధ్య ప్రేమాయణం నడిచింది. తాజాగా అదే అమ్మాయి తన తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని.. వెంటనే డబ్బు సర్దుబాటు కాలేదని.. ఓ రూ.60 లక్షల రూపాయలను అప్పుగా ఉంటే ఇవ్వమని ప్రాధేయపడింది.

ఎంతైనా ప్రేమించిన వ్యక్తి.. పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి కాబట్టి మొహమాటపడకుండా ఆమె చెప్పిన రెండు అకౌంట్లకు డబ్బు బదిలీ చేశాడు ఆ సదరు యువకుడు. అంతే.. ఎప్పుడైతే డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిందో ఇక ఆ అమ్మాయి నెంబరు నుండి కాల్స్ రావడం బంద్ అయ్యాయి. ఆ తర్వాత ఎన్నిసార్లు తను ట్రై చేసినా సరే ఆ అమ్మాయి ఫోన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

తర్వాత ఎంక్వయరీ చేస్తే ఆ అమ్మాయి పచ్చి మోసగత్తె అని తేలింది. అంత పెద్ద సీఈఓ కూడా.. తాను ఆన్‌లైన్ ఫ్రాడ్‌కు బలయ్యాడని ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఇంకేముంది.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైబర్ క్రైం విభాగానికి ఆ కేసును బదిలీ చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.