ప్రాణాలకు తెగించి రైలు ప్రమాదం నుంచి బాలుడిని కాపాడిన కానిస్టేబుల్

Updated: Feb 5, 2018, 08:24 PM IST
ప్రాణాలకు తెగించి రైలు ప్రమాదం నుంచి బాలుడిని కాపాడిన కానిస్టేబుల్
ANI Photo

కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడిన బాలుడు రైలుకి, ప్లాట్‌ఫామ్‌కి మధ్య చిక్కుకోగా అక్కడికి సమీపంలో వున్న ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రాణాలకి తెగించి ఆ బాలుడిని కాపాడిన ఘటన ఇది. ముంబైలోని నైగావ్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడే వున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. 

వివరాల్లోకి వెళ్తే, నైగావ్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ తన ఏడేళ్ల కొడుకుతో కలిసి రైలు ఎక్కే ప్రయత్నం చేసింది. ఆమె రైలు ఎక్కిన వెంటనే ఆ బాలుడు కూడా తల్లిని అనుసరిస్తూ రైలు ఎక్కబోయాడు కానీ ఈలోపే రైలు కదిలింది. దీంతో రైలు ఎక్కే ప్రయత్నం చేసిన బాలుడు అనుకోకుండా రైలుకి, ప్లాట్‌ఫామ్‌కి మధ్య వున్న చిన్న సందులో పడిపోయాడు. 

 

అదే సమయంలో అక్కడికి కొద్దిదూరంలో వున్న రైల్పే ప్రొటెక్షన్ ఫోర్స్‌కి చెందిన ఓ కానిస్టేబుల్ హుటాహుటిన అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. అప్పటికే రైలు వేగం పుంజుకుంది. అయినప్పటికీ అతడు తన ప్రాణాన్ని లెక్కచేయకుండా ఆ బాలుడిని కాపాడేందుకు ముందుకు దూకాడు. బాలుడు రైలు కిందపడి నలిగిపోకుండా తన శాయశక్తులా కృషిచేసి అతడి ప్రాణాలు కాపాడాడు. ప్లాట్‌ఫామ్‌పై నిలిచి వున్న ఇతర ప్రయాణికులు ఆ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేస్తోన్న ప్రయత్నాన్ని గమనించి అతడికి తమ వంతు సహాయం అందించారు. మొత్తానికి తన ప్రాణాల్ని లెక్కచేయకుండా బాలుడిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ని నిజంగా మనస్పూర్తిగా అభినందించితీరాల్సిందే.