స్టాలిన్ భావోద్వేగం.. ఇప్పుడైనా 'అప్పా' అని పిలవనా?

రాజాజీ హాల్‌లో డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయాన్ని సందర్శించేందుకు పలువురు ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.

Updated: Aug 10, 2018, 04:38 PM IST
స్టాలిన్ భావోద్వేగం.. ఇప్పుడైనా 'అప్పా' అని పిలవనా?

కరుణానిధి మరణంపై ఆయన కుమారుడు స్టాలిన్ భావోద్వేగంతో రాసిన పద్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'నా చిన్నప్పటి నుండి మిమ్మల్ని తలైవర్(నాయకుడు)అనే పిలిచాను. కానీ ఇప్పుడైనా అప్పా(నాన్న)అని పిలవనా?'అని స్టాలిన్ రాశారు. అటు తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి సేవలకు గుర్తింపుగా.. కేంద్రం వెంటనే ఆయనకు భారతరత్న ఇవ్వాలని విద్యుతలై చిరుతైక్కల్ కత్చి పార్టీ అధినేత తొలి తిరుమలవర్ డిమాండ్ చేశారు.

కరుణానిధి తెలుగువారే..

కరుణానిధి వాస్తవానికి తెలుగు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని తురువరూర్‌ జిల్లాలోని తిరుక్కువలై గ్రామంలో తెలుగు వారికే కరుణానిధి జన్మించారు. ఆయన అసలు పేరు దక్షిణామూర్తి.

కాసేపట్లో చెన్నై చేరుకోనున్న ప్రధాని

రాజాజీ హాల్‌లో డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయాన్ని సందర్శించేందుకు పలువురు ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ కరుణకు నివాళులు అర్పించడానికి చెన్నైకి రానుండగా.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్‌లు కళైంజర్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. అటు తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్, సీఎం పళని స్వామిలతో పాటు.. తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కరుణకి శ్రద్ధాంజలి ఘటించారు. సాయంత్రం 4 గంటల సమయంలో కరుణానిధి అంత్యక్రియలు జరగనున్నాయి.

నేడు దేశవ్యాప్తంగా సంతాపదినం ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశ వ్యాప్తంగా సంతాపదినం ప్రకటించింది. కరుణానిధి మరణానికి సంతాప సూచకంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం కూడా వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. బీహార్‌లో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది.

నేడు సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి మృతి చెందడంతో తమిళనాడు ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రంలో నేడు, రేపు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ రద్దు చేశారు. ఈ రోజు తమిళనాడులో సినిమాల ప్రదర్శనల కూడా నిలిపివేయనున్నారు. తమిళనాడు వ్యాప్తంగా రాత్రి 7 గంటల వరకు పెట్రోల్‌ బంక్‌లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్‌ చేశారు. కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్లే కేఎస్‌ ఆర్టీసీ బస్సులన్నీ రద్దు చేశారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close