సినీ నటిపై దాడి చేసి దోపిడి.. 'ధక్ ధక్' గ్యాంగ్‌పై అనుమానాలు!

ఆస్తమా రోగి అయిన ఆమె ఈ షాక్‌తో స్పృహతప్పి కిందపడిపోగా వెంటనే అక్కడికి చేరుకున్న ఓ ఆర్మీ అధికారి ఆమెను కాపాడి నిందితులు పరారైన వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసుకున్నారు.

Last Updated : Jan 21, 2019, 10:46 AM IST
సినీ నటిపై దాడి చేసి దోపిడి.. 'ధక్ ధక్' గ్యాంగ్‌పై అనుమానాలు!

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, మాజీ టీమిండియా క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భార్య ఫర్హీన్ ప్రభాకర్‌పై వేధింపులకు పాల్పడిన నలుగురు గుర్తు తెలియని దుండగులు ఆమె పర్స్‌తోపాటు మొబైల్ ఫోన్స్ దోచుకుపోయారు. న్యూఢిల్లీలోని సర్వ్‌ప్రియ విహార్‌లో నివాసం ఉంటున్న ఆమె సౌత్ ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్‌కి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 

కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న ఫర్హీన్ ప్రభాకర్ ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన కారు ఆపగా.. వెంటనే వెనకనుంచి దూసుకొచ్చిన నలుగురు దుండగులు కారు అద్దాలు ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఏం జరుగుతుందో అర్థం కాని ఆమె తన కారును పక్కకు ఆపి పార్క్ చేయగానే ఆమె వద్దకు దూసుకెళ్లిన దుండగులు.. కారు సరిగ్గా నడపడం రాదా అంటూ ఆమెతో గొడవకు దిగి ఆమె పర్స్ లాక్కున్నారు. అందుకు ప్రతిఘటించినందుకు ఫర్హీన్ ప్రభాకర్‌పై దుర్భాషలాడి అవతలి వైపు పార్క్ చేసి వున్న తమ కారులో అక్కడి నుంచి పరారయ్యారు. 

ఆస్తమా రోగి అయిన ఫర్హీన్ ప్రభాకర్ ఈ షాక్‌తో స్పృహతప్పి కిందపడిపోగా వెంటనే అక్కడికి చేరుకున్న ఓ ఆర్మీ అధికారి ఆమెను కాపాడి నిందితులు పరారైన వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసుకున్నారు. ఆర్మీ అధికారి ఇచ్చిన సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు.. ఫర్హీన్ ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది 'ధక్ ధక్' గ్యాంగ్ పనే అయ్యుండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. చోరీకి గురైన పర్సులో రూ.16,000 నగదు, విలువైన డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్స్ ఉన్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  

Trending News