హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ప్రమాద హెచ్చరిక.. భారీస్థాయిలో వరదలు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీవ్ర ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. భారీ స్థాయిలో వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి.

Last Updated : Sep 24, 2018, 07:16 PM IST
హిమాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ప్రమాద హెచ్చరిక.. భారీస్థాయిలో వరదలు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీవ్ర ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. భారీ స్థాయిలో వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే జాతీయ రహదారులను ప్రభుత్వం మూసివేయించింది. పోలీసులు తమ ముందస్తు చర్యలలో భాగంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ఈ భారీ వరదల వల్ల రాజధానిలో బస్సులు, కారులు ఇత్యాది వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ముఖ్యంగా మంచు తుఫాను వల్ల జరుగుతున్న బీభత్సం అంతా ఇంతా కాదు. లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రావి నదీతీర ప్రాంతమంతా అస్తవ్యస్తంగా తయారైంది. కులు ప్రాంతంలో ప్రమాదపుటంచుల మధ్య బిక్కుబిక్కుమని గడుపుతున్న జనాలు వైమానిక దళం సహాయంతో రక్షింపబడ్డారు. ఈ క్రమంలో వరద హెచ్చరికను ప్రకటిస్తూ ప్రభుత్వం పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. అలాగే పర్వాతారోహణకు వస్తున్న యాత్రికులను వెనక్కు పంపించేందుకు అధికార యంత్రాంగం ప్రకటనను జారీ చేసింది. 

ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే భారత రక్షణ దళంతో పాటు వైమానికి దళ సేనలు హిమాచల్ ప్రాంతంలో సేవలు అందిస్తున్నాయి. పాలంపూర్‌, కులు ప్రాంతాల్లో ఇప్పటికే కొండ ప్రాంతాల్లో అలజడి చోటుచేసుకుంటుంది. కొండ క్రింద ప్రాంతాలన్నీ కూడా జలాశయాలుగా మారాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సత్వరం విపత్తు నిర్వహణ శాఖకు ఆదేశాలిస్తూ.. పరిస్థితిని సమీక్షించమని తెలియజేసింది. హెలికాప్టర్లలో ఇప్పటికే విపత్తు నిర్వహణా సిబ్బంది హిమాచల్ ప్రదేశ్‌కు
చేరుకుంటున్నారు. 

Trending News