దేశ రెండో రాజధానిగా హైదరాబాదా?!

దేశ రెండో రాజధానిగా హైదరాబాదును ఏర్పాటుచేయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.

Updated: Jan 3, 2018, 07:15 PM IST
దేశ రెండో రాజధానిగా హైదరాబాదా?!

దేశ రెండో రాజధానిగా హైదరాబాదును ఏర్పాటుచేయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయి ఆందోళన కల్గించే రీతిలో ఉందని గతవారం పెద్దల సభలో చర్చ జరిగింది. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రస్తావన వచ్చింది. అయితే అలాంటి ఉద్దేశం లేదని కేంద్రం ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే.. గతవారం ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో కాలుష్యం పెరిగిపోయి ఆందోళన కలిగించే రీతితో ఉండటంపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఆ సందర్భంగా అన్నాడిఎంకే ఎంపీ ఒకరు సభలో లేచి మాట్లాడుతూ, ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోతోందని.. పార్లమెంట్ సమావేశాలను దక్షిణ భారతదేశానికి మార్చాలని అన్నారు. "ఢిల్లీలో కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదో గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. మనుషులకు ఎంతమాత్రం ఇది ఆవాసయోగ్యంగా లేదు. కనుక పార్లమెంట్ సమావేశాలను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలి" అన్నారు.

ఈ నేపథ్యంలోనే తెరాస ఎంపీ బూరనర్సయ్యగౌడ్ హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని కేంద్రాన్ని ప్రశ్నించగా.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్రాజ్ గంగారాం అహిర్  దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ఏర్పాటుకు ఎలాంటి ప్రణాళిక లేదని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.