నన్ను కూడా రేప్ చేసి చంపేస్తారు: కథువా కేసులో లాయర్ సంచలన వ్యాఖ్యలు

కథువా ఘటనకు సంబంధించిన కేసును వాదిస్తున్న న్యాయవాది దీపిక రజావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Updated: Apr 17, 2018, 06:01 AM IST
నన్ను కూడా రేప్ చేసి చంపేస్తారు:  కథువా కేసులో లాయర్ సంచలన వ్యాఖ్యలు
Image Credit: ANI

కథువా ఘటనకు సంబంధించిన కేసును వాదిస్తున్న న్యాయవాది దీపిక రజావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పటికే బెదిరింపు కాల్స్ వస్తున్నానని.. తాను ఈ కేసు వాదిస్తే తనను కూడా రేప్ చేసి చంపేస్తామని పలువురు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తనకు రక్షణ కల్పించాల్సిందిగా తాను సుప్రీంకోర్టుకి విన్నవించుకుంటున్నానని ఆమె తెలిపారు.

తాను ప్రస్తుతం చాలా ప్రమాదంలో ఉన్నానన్న విషయం అర్థమవుతుందని.. తన ప్రాణాలు పోయినా ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం బాధితురాలైన బాలిక తండ్రి కేసును కాశ్మీర్ నుండి చండీగఢ్‌కి షిఫ్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే తమ మీద పలువురు ఒత్తిడి చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇటీవలే ఇదే కేసుకు సంబంధించి నిందితులను సమర్థిస్తూ హిందూ ఏక్తా మంచ్ అనే సంఘం ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే.

జనవరి 8వ తేదిన కొందరు వ్యక్తులు ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత హతమార్చారు. ఈ కేసులో ప్రస్తుతం ఓ మాజీ ప్రభుత్వ ఉద్యోగితో పాటు మొత్తం ఎనిమిది మందిపై అభియోగాలు ఉన్నాయి. వారిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఈ ఘటన పట్ల ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ప్రభుత్వం వెంటనే దర్యాప్తు జరిపి కారకులను శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఈ కేసును వాదిస్తున్న మహిళా న్యాయవాదికి కూడా బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం.