ప్రధాని నరేంద్ర మోదీకి షాకిచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

డిమానిటైజేషన్‌తో ఏం ప్రయోజనం చేకూరింది : నితీశ్ కుమార్

Last Updated : May 27, 2018, 05:11 PM IST
ప్రధాని నరేంద్ర మోదీకి షాకిచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి షాకిచ్చారు. బీజేపీతో కూటమిగా ఏర్పడి, బీజేపీ మిత్రపక్షాల సహకారంతో బీహార్‌లో అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్.. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన డిమానిటైజేషన్ (పాత పెద్ద నోట్ల రద్దు)తో ఏం ప్రయోజనం చేకూరింది అని ప్రశ్నించారు. జనతా దళ్-యునైటెడ్ (జేడీయు) అధినేత నితీశ్ కుమార్ శనివారం డిమానిటైజేషన్ గురించి మాట్లాడుతూ.. ''నిజానికి అసలు పాత పెద్ద నోట్ల రద్దు కారణంగా నిరుపేదలకు ఏం ప్రయోజనం చేకూరింది'' అని సందేహం వ్యక్తంచేశారు. అంతేకాకుండా డిమానిటైజేషన్ సమయంలో బ్యాంకులు ధనవంతులకు కొమ్ము కాసి వాళ్ల వద్ద ఉన్న నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు సహకరించాయని అభిప్రాయపడ్డారు. ''మొదట్లో తాను కూడా డిమానిటైజేషన్‌కి మద్దతు పలికాను. కానీ ఆ పాత పెద్ద నోట్ల రద్దు కారణంగా ఎంతమంది పేదలు లాభపడ్డారు ? బాగా డబ్బు ఉన్న కుబేరులు వాళ్ల నల్లధనాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చుకున్నారు తప్పిస్తే'' అంటూ తీవ్ర అసహనాన్ని వెళ్లగక్కారు. శనివారం బీహార్ రాజధాని పాట్నాలో బ్యాంకర్లతో జరిగిన ఓ సమావేశంలో నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నరేంద్ర మోదీ సర్కార్ తీసుకొచ్చిన డిమానిటైజేషన్‌ని నితీశ్ కుమార్ వ్యతిరేకించడం ఇదే మొదటిసారి. అయితే, ఆశ్చర్యకరంగా ఓవైపు దేశంలో తమ పార్టీ నాలుగేళ్ల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందంటూ బీజేపీ శ్రేణులు సంబంరం చేసుకుంటున్న రోజే సరిగ్గా నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనియాంశమైంది. అన్నింటికిమించి బీహార్‌లో బీజేపీ మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఇలా వ్యాఖ్యానించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. నితీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుషీల్ కుమార్ షిండే కూడా అక్కడే ఉండటం గమనార్హం.

Trending News