ప్రధాని మోదీ నిరక్షరాస్యుడు.. పైగా దేవుడు కాదు: కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్

ముంబయి కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Sep 13, 2018, 08:59 PM IST
ప్రధాని మోదీ నిరక్షరాస్యుడు.. పైగా దేవుడు కాదు: కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్

ముంబయి కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ బుధవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ జీవితంపై లఘుచిత్రాన్ని నిర్మించి.. దానిని ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ప్రదర్శించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ ఆలోచనపై ఆయన మండిపడ్డారు. మోదీ ఒక నిరక్షరాస్యుడని.. అలాంటి వ్యక్తి జీవితం నుండి విద్యార్థులు ఏ విధంగానూ స్ఫూర్తిని పొందరని ఆయన పేర్కొన్నారు. అయితే సంజయ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కాగా.. బీజేపీ నేతలు తనపై మండిపడిన తీరును సంజయ్ ఖండించారు.

"ఈ ప్రజాస్వామ్యంలో నేను ఆ విధంగా మాట్లాడవచ్చు. ప్రధానిని నిరక్షరాస్యుడని సంబోధించడం తప్పేమీ కాదు. పైగా ఈ ప్రజాస్వామిక దేశంలో మోదీ దేవుడేమీ కాదు. పిల్లలపై బలవంతంగా రాజకీయాలను రుద్దడం నేను సమర్థించను. మోదీపై లఘుచిత్రాన్ని నిర్మించి పిల్లలకు చూపించడాన్ని నేను తప్పు పడతాను. ఒక నిరక్షరాస్యుడి గురించి పిల్లలు నేర్చుకోవాల్సింది ఏదీ లేదు. ఆయనకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు తెలుసుకొని ఏం చేస్తారు?" అని సంజయ్ నిరుపమ్ ప్రశ్నించారు. 

ఢిల్లీ యూనివర్సిటీలో ప్రధాని చదువుకున్నారని అంటుంటారని.. కానీ ఆయన చదువుకున్న డిగ్రీలేమిటో ఎన్నిసార్లు అడిగినా ఆ విశ్వవిద్యాలయం వారు ఎందుకు బయటపెట్టడం లేదని సంజయ్ నిరుపమ్ ప్రశ్నించారు. ఒకవేళ మోదీ లఘుచిత్రం చూసిన పిల్లలు అదే ప్రశ్న అడిగితే.. సమాధానం చెప్పే ధైర్యం బీజేపీకి ఉందా? అని ఆయన అడిగారు.

అయితే నిరుపమ్ మాటలు మతిభ్రమించిన వ్యక్తులు మాట్లాడుతున్న మాటల్లా ఉన్నాయని బీజేపీ నేత ఎన్సీ షైనా అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీని 125 కోట్ల భారతీయులు ఎన్నుకున్నారని.. వారిలో అందరూ నిరక్షరాస్యులు కాదనే సత్యాన్ని ఆయన తెలుసుకుంటే మంచిదని ఆమె హితవు పలికారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆమె తెలిపారు. ప్రధాని మోదీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని మంగేష్ హదవాలే దర్శకత్వం వహించిన  "ఛలో జీతే హై" అని లఘుచిత్రాన్ని సెప్టెంబరు 18వ తేది నుండి మహారాష్ట్రలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రదర్శించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Trending News