సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Last Updated : Sep 24, 2018, 08:10 AM IST
సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఈశాన్య రాష్ట్రం సిక్కింలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ సిక్కింలో నిర్మించిన తొలి విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో సిక్కిం తొలిసారి దేశ విమానయాన పటంలో చోటు దక్కించుకోనుంది. రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్‌కు 33 కి.మీ.ల దూరంలోని పాక్యాంగ్‌లో రూ.605.59 కోట్లతో నిర్మించిన తొలి విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు.

పాక్యాంగ్‌లో సముద్ర తలానికి 1,120 మీటర్ల ఎత్తులో ఈ విమానాశ్రయాన్ని నిర్మించడానికి తొమ్మిదేళ్లు పట్టింది. 206 ఎకరాల్లో ఈ ఎయిర్‌పోర్టు విస్తరించి ఉంది. పర్వత శిఖరాన్ని తొలచి భవంతులను నిర్మించారు. అక్టోబర్‌ 4 నుంచి ఢిల్లీ, కోల్‌కతా, గౌహతిల నుంచి గ్యాంగ్‌టక్‌కు రెగ్యులర్ విమానాలు తిరుగుతాయి. సిక్కిం రాజధాని గాంగ్టక్ యొక్క ఎత్తైన పర్వత ప్రాంతంలో నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి ఇటీవలే కేంద్రం నుంచి కూడా అనుమతులు లభించాయి. ఈ ఎయిర్‌పోర్టు చైనా సరిహద్దుకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దేశంలో ప్రయాణికుల సేవలు అందించే 100వ విమానాశ్రయం.

సిక్కింకి వెళ్లాలంటే ఇప్పటివరకు సిలిగురిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంపైనే ప్రయాణికులు ఆధారపడేవారు. కాగా.. పాక్యాంగ్ విమానాశ్రయం రాకతో ఈ సమస్య తీరినట్లే. పాక్యాంగ్ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. పర్యాటకులు తక్కువ సమయంలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిక్కింకి వెళ్లొచ్చు.

Trending News