కన్నుమూసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి కూతురు

ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి కూతురు, సంప్రదాయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు రాధా విశ్వనాథన్(84) కన్నుమూశారు. 

Updated: Jan 3, 2018, 07:20 PM IST
కన్నుమూసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి కూతురు

ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి కూతురు, సంప్రదాయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు రాధా విశ్వనాథన్(84) కన్నుమూశారు. రాధా విశ్వనాథన్ ఐదు దశాబ్దాలపాటు తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మితో కలిసి సంగీతకచేరీల్లో పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రాధా విశ్వనాథన్ చెన్నైలో మరణించినట్లు ఆమె కుమారుడు శ్రీనివాసన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాధా సంగీత విద్వాంసురాలు మాత్రమే కాదు.. చక్కటి సంప్రదాయ నృత్యకళాకారిణి కూడా. ఆవిడ 11 ఏళ్ల ప్రాయంలో నాట్యంలో అరంగేట్రం చేశారు. తన అభినయంతో ప్రేక్షకులను అలరించారు. 

రాధా విశ్వనాథన్ డిసెంబర్ 11, 1934 తేదిన గోబిచెట్టిపాలయంలో జన్మించారు. ఆ తర్వాత వివాహం చేసుకుని అహ్మదాబాద్‌కు వెళ్లిపోయారు. అయితే తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మికి తోడుగా ఉండాలని, తనతో పాటు కచేరీలో పాల్గొనాలని భావించి తన భర్తతో సహా తిరిగి వచ్చేశారు. కొన్ని రోజుల తర్వాత నృత్యానికి స్వస్తి పలికి తల్లి మాదిరిగానే కర్ణాటక సంగీతంలో తనదైన శైలిలో రాణించారు.

మార్చి 2008లో లలితకళా అకాడమీ "సంగీతరత్న"తో రాధా విశ్వనాథన్‌ను గౌరవించింది. ఏప్రిల్ 2010లో ఆమె కర్ణాటక సంగీతానికి  చేసిన అద్భుతమైన సేవలకుగానూ  క్లేవ్‌ల్యాండ్ ఆరాధన కమిటీ " కళాచంద్రిక" బిరుదుతో సత్కరించింది. వీటితో పాటు రాధా విశ్వనాథన్ ఎన్నో సత్కారాలు, ప్రశంసలు అందుకున్నారు.