నిండు కుండలా మారిన ఇడుక్కి డ్యామ్.. అన్ని గేట్లు ఎత్తి నీటి విడుదల!

Last Updated : Aug 11, 2018, 12:50 AM IST
నిండు కుండలా మారిన ఇడుక్కి డ్యామ్.. అన్ని గేట్లు ఎత్తి నీటి విడుదల!

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక లోతట్టు ప్రాంతాలు పూర్తి జలమయం కాగా రహదారులు దెబ్బతినడంతో గ్రామాలకు గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 27కి చేరినట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుని తిరువనంతపురం కేంద్రంగా అన్ని జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అందాల్సిన సహాయం గురించి కూడా రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పడుతున్నట్టు అక్కడి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. 

ఇదిలావుంటే, గత 26 ఏళ్లలో ఒక్కసారి కూడా తెరుచుకోని ఇరుక్కి డ్యామ్ గేట్లు ఈ వర్షాల కారణంగా తెరుచుకున్నాయి. వరద నీరు డ్యామ్‌లోకి పోటెత్తుతుండటంతో సంబంధిత అధికార యంత్రాంగం డ్యామ్‌కి ఉన్న 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తోంది. చివరిసారిగా ఈ డ్యామ్ గేట్లను 1992లో ఎత్తి నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ డ్యామ్ గేట్లు ఎత్తాల్సిన అవసరం రాలేదు. దీంతో దిగువన నదికి ఇరువైపులా అనేక ప్రాంతాల్లో తీర ప్రాంతం కబ్జాకు గురైంది. ఈ వర్షాల కారణంగా తాజాగా గేట్లు ఎత్తడంతో కబ్జాకు గురైన ఆయా ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఇప్పటికే సుమారు 200లకుపైగా కుటుంబాలను నది తీర ప్రాంతాల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. 

వరదల్లో నీట మునిగిన కారు

ఇడుక్కీ డ్యామ్ ఎత్తు 2,403 మీటర్లు కాగా శుక్రవారానికి 2,401 మీటర్ల ఎత్తులో వరద నీరు వచ్చి చేరింది. రిజర్వాయర్ నిండు కుండలా మారడంతో ఆ భారం డ్యామ్‌పై పడకుండా ఉండటం కోసం మొత్తం ఐదు గేట్లను ఎత్తాల్సి వచ్చినట్టు కేరళ విద్యుత్ శాఖ మంత్రి ఎం.ఎం. మణి మీడియాకు తెలిపారు. 

Trending News