రాజ్యసభలో ఆమోదం పొందిన గ్రాట్యుటీ బిల్లు

ప్రభుత్వ రంగాలతో పాటు ప్రైవేటు రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పన్ను రహిత గ్రాట్యుటీని పెంచాలని భావించింది భారత సర్కారు. 

Last Updated : Mar 22, 2018, 05:22 PM IST
రాజ్యసభలో ఆమోదం పొందిన గ్రాట్యుటీ బిల్లు

ప్రభుత్వ రంగాలతో పాటు ప్రైవేటు రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పన్ను రహిత గ్రాట్యుటీని పెంచాలని భావించింది భారత సర్కారు. తాజాగా పన్ను రహిత గ్రాట్యుటీ పరిమితిని రూ.10 లక్షల రూపాయల నుండి రూ.20 లక్షలకు  పెంచిన క్రమంలో ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపడం విశేషం. గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారం ఫ్యాక్టరీలు, ఆయిల్ కంపెనీలు, మైనింగ్ సంస్థలు, పోర్టులు, రైల్వేలు.. ఇలాంటి సంస్థల్లో కనీసం అయిదు సంవత్సరాలు పనిచేసిన వారికి కూడా ఈ బిల్లు వర్తిస్తుంది.

సెంట్రల్ సివిల్ సర్వీస్ క్రిందకు రాకుండా ఉండి.. ప్రభుత్వ రంగ, ప్రభుత్వ అనుబంధ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారికి కూడా ఈ యాక్ట్ వర్తిస్తుంది. తాజా బిల్లుకు చట్ట సవరణ అవసరం లేదు. అలాగే ఈ గ్రాట్యుటీ పరిమితిని పెంచే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ బిల్లును గత వారమే లోక్ సభలో ఆమోదించగా.. ఈ రోజు రాజ్యసభలోనూ ఆమోదించారు.

మొన్నటి వరకు వివిధ కారణాల వల్ల సభ వాయిదా పడుతూ రావడంతో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా? లేదా? అని చాలామంది సందేహపడ్డారు. కానీ ఎట్టకేలకు బిల్లు ఆమోదం పొందడంతో వేతనజీవులకు కొంతలో కొంత ఊరట లభించినట్లైంది. ఈ బిల్లును ఈ రోజు కార్మిక మంత్రి సంతోష్‌ కుమార్‌ మూజువాణి ఓటు ద్వారా ఆమోదింపజేయడం విశేషం. 7వ వేతన సంఘం అమలయ్యాక.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ రూ.20 లక్షలకు పెరిగింది

Trending News