రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఇకపై తగ్గనున్న రైలు టికెట్ ధరలు !

రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఫ్లెక్సీ ఫేర్స్ విధానం రద్దు, పలు మార్గాల్లో ప్రత్యేక డిస్కౌంట్ అమలు ప్రతిపాదనలు! 

Updated: Sep 14, 2018, 06:50 PM IST
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఇకపై తగ్గనున్న రైలు టికెట్ ధరలు !

దేశవ్యాప్తంగా నిత్యం రైళ్లలో ప్రయాణించే లక్షలాది రైలు ప్రయాణికులకు ఇది ఓ గుడ్ న్యూస్ అనుకోవాల్సిందే. ఇకపై పలు ఎంపిక చేసిన ప్రీమియం రైళ్లలో టికెట్ ధరలు తగ్గుముఖం పట్టనున్నాయని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టిన డైనమిక్ ప్రైసింగ్ / ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని ఇకపై రద్దు చేసేందుకు ఇండియన్ రైల్వే యోచిస్తుండటమే. అవును, త్వరలోనే ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని పలు రైళ్లలో రద్దు చేసేందుకు ఇండియన్ రైల్వే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ప్రయోగాత్మకంగా 40 ఎంపిక చేసిన రైళ్లలో ఈ ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని తొలగించాలనే ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు సమాచారం. తక్కువ రద్దీ ఉన్న రైలు మార్గాల్లో టికెట్ ధరల్లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించేందుకు సైతం రైల్వే శాఖ సమాయత్తమవుతోందనేది ఆ వార్తల సారాంశం. 

2016 సెప్టెంబర్‌లో ఈ ఫ్లెక్సీ ఫేర్ విధానం అమలులోకి వచ్చింది. రాజధాని, దురంతో, శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఈ ఫ్లెక్సీఫేర్ విధానం వర్తించేలా అప్పట్లో రైల్వే శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న 42 రాజధాని ఎక్స్‌ప్రెస్, 46 శతాబ్ధి ఎక్స్‌ప్రెస్, 54 దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ఒకానొక దశలో విమానం టికెట్ ధరలకు సమానంగా ఈ టికెట్ ధరలు పెరగడం రైలు ప్రయాణికులకు ఆందోళనకు గురిచేసింది. దీంతో ఫ్లెక్సీ ఫేర్ విధానంతో రైలు ప్రయాణం సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయిందనే ఆరోపణలు రావడంతోపాటు పలు సందర్భాల్లో ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ సైతం తగ్గిపోయిందని, ఈ కారణంగానే ప్రయోగాత్మకంగా మళ్లీ ఈ ప్రీమియం రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని రద్దు చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్టు సమాచారం.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close