యడ్యూరప్ప ప్రభుత్వం ఎంతో కాలం నిలవదన్న కాంగ్రెస్ పార్టీ

జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మద్దతు ఎక్కువుంది : కాంగ్రెస్ పార్టీ 

Updated: May 18, 2018, 11:37 AM IST
యడ్యూరప్ప ప్రభుత్వం ఎంతో కాలం నిలవదన్న కాంగ్రెస్ పార్టీ

కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదని, మెజారిటీ ఎమ్మెల్యేలు జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తుండటమే అందుకు కారణం అని అన్నారు కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివ కుమార్. ''భారతీయ జనతా పార్టీకన్నా ఎక్కువ మద్దతు తమకే వుంది. జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు నూటికి నూరు శాతం కూటమితోనే వున్నారు. అందుకే తాము న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తాం'' అని శివ కుమార్ అభిప్రాయపడ్డారు. 

 

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి బయటికొచ్చారని, సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ని వీడి బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని వస్తోన్న వార్తలను మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో బీజేపీకి, కేంద్రానికి వ్యతిరేకంగా కర్ణాటక విధాన సౌధ ఎదుట ఆందోళన చేపట్టిన సందర్భంగా సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి చెందిన 118 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం తమతో ఇక్కడే వున్నారని స్పష్టంచేశారు.