బహుమతులుగా వీటిని ఇవ్వకూడదట..!

పెళ్లిరోజు, పుట్టినరోజు, వెడ్డింగ్ డే.. లాంటి శుభకార్యాలకు గిఫ్టులు ఇవ్వడం కానీ లేదా పుచ్చుకోవడం కానీ సహజం.

Last Updated : Jan 20, 2018, 01:53 PM IST
బహుమతులుగా వీటిని ఇవ్వకూడదట..!

పెళ్లిరోజు, పుట్టినరోజు, వెడ్డింగ్ డే.. లాంటి శుభకార్యాలకు గిఫ్టులు ఇవ్వడం లేదా పుచ్చుకోవడం సహజం. అయితే, కొందరికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో, ఎలాంటివి  తీసుకోకూడదో తెలీదు. ఏదో కొంటారు.. వెళ్లి తమ స్నేహితులకో, బంధువులకో ఇస్తారు. అలా ఏదంటే అది కొనుక్కొని వెళ్లి ఇచ్చిరావడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని చెబుతున్నారు కొందరు జ్యోతిష్యులు. అయితే ఇవ్వన్నీ మూఢనమ్మకాలని.. అలాంటి మాటలు నమ్మవద్దని అంటున్నారు హేతువాదులు. ఈ క్రమంలో ఎప్పుడు ఎలాంటి బహుమతి ఇవ్వాలో..  ఎటువంటి వస్తువులు ఇవ్వకూడదో మనం కూడా తెలుసుకుందాం ! 

టవల్స్, కర్చీఫ్ వద్దు

టవల్స్, చేతి రుమాలు బహుమతులుగా తీసుకోకూడదు. ఇచ్చేవారికి, పుచ్చుకొనేవారికి మధ్య వివాదాలు వస్తాయి. బహుమతిగా ఇస్తే వద్దని చెప్పండి లేదా వారి చేతిలో ఒక నాణెం పెట్టండి అంటున్నారు కొందరు ఆస్ట్రాలజిస్టులు. 

నీళ్లతో కూడిన వస్తువులు దురదృష్టమట

నీళ్లతో కూడిన వస్తువులు (అక్వేరియం లాంటివి) బహుమతిగా ఇవ్వరాదు. ఇస్తే మీదగ్గర ఉన్న అదృష్టం వారివద్దకు వెళుతుంది. తరచూ ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారన్నది చైనా జ్యోతిష్యుల అభిప్రాయం. 

పటాలు, విగ్రహాలు కానుకలుగా వద్దు

దేవుని పటాలు, విగ్రహాలు బహుమతులుగా ఇవ్వకూడదనేది కొందరి అభిప్రాయం. వీటిని తీసుకున్నవారికి ఎలా భద్రంగా ఉంచుకోవాలో తెలీదు. తెలిస్తే సరి, తెలియకపోతే వారికి చెప్పాలట. శుభకార్యాలలో వారికి వినేంత సమయం ఉండకపోవచ్చు కనుక వీలైనంత వరకు ఇవ్వడానికి ప్రయత్నించకూడదని కూడా చెబుతున్నారు కొందరు జ్యోతిష్యులు.  

పనికి సంబంధించిన వస్తువులు ఇవ్వకూడదట

పనికి సంబంధించిన వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదట. అవే తీసుకున్నవారి పతనానికి కారణం అవుతాయి అని కొందరి అభిప్రాయం. మీరు రచయిత అయితే పెన్నులు, పుస్తకాలు కానుకలుగా ఇవ్వకూడదట. ఒకవేళ పుచ్చుకొనే వ్యక్తి ఆదే ఫీల్డ్‌కు చెందిన వారైతే, మీరిచ్చే బహుమతికి ఉపయోగం ఉండదు. అలాంటివి అతనికి అనేకం బహుమతులుగా వస్తాయి కనుక మీరు ఇచ్చేవాటికి విలువ ఇవ్వరనేది కూడా కొందరి అభిప్రాయం. 

పదునైన వస్తువులు 

పదునైన వస్తువులు ఇంటిలో ప్రతికూలతలకు దారితీస్తాయట. వీటిని బహుమతిగా ఇవ్వడం లేదా స్వీకరించడం ఇద్దరికీ దురదృష్టమే. పైగా అనారోగ్య సమస్యలు వస్తాయి. కావున తిరస్కరించడం ఉత్తమమని కొందరి భావన.  

Trending News