జీవశాస్త్రంలో భారత్ సత్తా చాటిన వ్యక్తి.. హరగోవింద్ ఖొరానా

భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త హరగోవింద్ ఖొరానా 96వ జయంతి సందర్భంగా గూగుల్ ఒక డూడుల్‌ను రూపొందించింది.

Updated: Jan 9, 2018, 08:27 PM IST
జీవశాస్త్రంలో భారత్ సత్తా చాటిన వ్యక్తి.. హరగోవింద్ ఖొరానా

భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త హరగోవింద్ ఖొరానా 96వ జయంతి సందర్భంగా గూగుల్ ఒక డూడుల్‌ను రూపొందించింది. ఈ నోబెల్ పురస్కార విజేత వంశపారంపర్యంగా సంక్రమించే జీవనిర్మాణానికి దోహదం చేసే 'కృతిమ జీన్' ను సృష్టించారు. ఈ ఆవిష్కరణ జెనెటిక్ ఇంజనీరింగ్ అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారితీసింది. 

ఖొరానా అప్పటి బ్రిటీష్ ఇండియాలోని రాయ్పూర్ (ప్రస్తుతం కబీర్వాలా, పాకిస్థాన్) లోని ఒక గ్రామంలో జన్మించారు. తండ్రి శిక్షణలో రాయడం, చదవడం నేర్చుకున్నారు. లాహోర్‌లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత, ఖొరానా పీ‌హెచ్‌డీ కొరకు యూకే వెళ్ళారు

1951-52లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయములో మాంసకృత్తులు, న్యూక్లిక్ ఆమ్లములకు సంబంధించిన పరిశోధనలు మొదలుపెట్టారు. ఖొరానా 1952లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా (వ్యంకూవర్) విశ్వవిద్యాలయములో పనిచేశారు. ఆయనకు అక్కడే నోబెల్ బహుమతి పొందాలనే ఆశయం దిశగా ప్రయత్నాలు చేయాలనే కోరిక కలిగింది.. అనుకున్నదే తడవుగా ఆ దిశగా అడుగులు వేశారు. 1960లో అమెరికాకు వెళ్లి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో తన పరిశోధనను కొనసాగించారు. 1966లో అమెరికా పౌరసత్వాన్ని పొందారు.

ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని ఖొరానా కనుగొన్నారు. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ (డిఎన్ఏ) ముక్కను ప్రయోగశాలలో మొదటిసారిగా సృష్టించారు. అలాగే డీఎన్ఏ ముక్కలను అతికించు 'డిఎన్ఏ లిగసె' అనబడుఎంజైమును కనుగొన్నారు. ఈ పరిశోధనల మూలముగా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవము వచ్చింది. 1968లో ఫిజియాలజీ/మెడిసిన్‌లో ఖోరానాకు నోబెల్ పురస్కారం లభించింది. హరగోబింద్ ఖొరానా 2011లో మసాచుసెట్స్‌లో 89 సంవత్సరాల వయసులో మరణించారు.