భారతదేశపు తొలి ఓటరు అతడే..

  

Last Updated : Oct 29, 2017, 08:02 PM IST
భారతదేశపు తొలి ఓటరు అతడే..

శ్యామ్ శరణ్ నేగి.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, మొదటిసారిగా ఎన్నికల కమీషన్ వద్ద ఓటరుగా పేరు నమోదు చేయించుకున్న వ్యక్తి ఇతను. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి తొట్టతొలి ఓటరు ఇతనే. దాదాపు 100 సంవత్సరాలు దాటి.. ముసలితనం పైబడినా.. ప్రతీ సంవత్సరం తప్పకుండా తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నాడు ఈ సీనియర్ ఓటరు. నవంబరు 9వ తేదీన కూడా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్నాడు ఈ సీనియర్ సిటిజన్. అయితే ఆరోగ్యం సహకరిస్తుందో లేదోనని బాధపడుతున్నాడు. అయితే శ్యామ్ శరణ్ గురించి తెలుసుకున్న స్థానిక కిన్నౌర్ జిల్లా మున్సిపల్ అధికారులు అతన్ని పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చి దిగబెట్టేందుకు, ఓటు వేశాక మళ్లీ ఇంటికి తీసుకెళ్లేందుకు ఒక స్పెషల్ వాహనాన్ని సమకూరుస్తామని తెలియజేశారట. అలాగే శ్యామ్ శరణ్‌కు పోలింగ్ బూత్ వద్దకు ఆహ్వానం పలకడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

2014 ఎన్నికల్లో భాగంగా, శ్యామ్ శరణ్ కథను వివిధ ఛానళ్లు ప్రచారం చేశాయి. గూగుల్ సంస్థ "ప్లెడ్జ్ టు ఓట్" పేరుతో ఆయన మీద ప్రత్యేక వీడియో తయారుచేసింది. 21 అక్టోబరు 1952 తేదీన తన తొలి ఓటును వేసిన శ్యామ్ శరణ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటును వేయకుండా వెనుదిరగలేదు. ఎవరైనా మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని అడిగినప్పుడు, నవ్వుతూ సమాధానం దాటవేస్తాడంట శ్యామ్ శరణ్. అది రహస్యమని.. తన వ్యక్తిగత విషయమని కూడా చెబుతాడట. 1975లో ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ టీచరుగా రిటైరైన ఆయన ఆనాటి రాజకీయ నాయకులను చూసి నేటి నేతలు తప్పక నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని అంటున్నారు. 

Trending News