"కోడి పందేల" చరిత్ర ఏంటో తెలుసుకుందాం..!

పందెం కోడి.. సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఉభయ గోదావరి జిల్లాల్లో అందరి నోటా వినబడే పేరు అనడంలో సందేహం లేదు.

Updated: Jan 12, 2018, 02:48 PM IST
"కోడి పందేల" చరిత్ర ఏంటో తెలుసుకుందాం..!

పందెం కోడి.. సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఉభయ గోదావరి జిల్లాల్లో అందరి నోటా వినబడే పేరు అనడంలో సందేహం లేదు. నిజం చెప్పాలంటే కోడి పందేల చరిత్ర ఈనాటి కాదు. అనాదికాలం నుండి శాస్త్రాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. సురవరం ప్రతాపరెడ్డి గారి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర'లో సైతం కోడి పందేల గురించి విపులంగా రాశారు. సంక్రాంతి వేళ కోడికి కత్తి కడితే కనక వర్షమే అనే సామెత పాతదైనా.. అందులో సత్యం ఎంత ఉందనే విషయం మాత్రం అనుమానమే. ఎందుకంటే వినోదం కోసం నిర్వహించే కోడి పందేలు వేరు..  డబ్బు కోసం ఆడే కోడి పందేలు వేరు. మొదటి దాని వలన ఎలాంటి నష్టమూ లేదు. కానీ రెండవ దాని వల్లే కాపురాలు కూలిపోయే పరిస్థితులు తలెత్తవచ్చు. నేడు కోడిపందేల పేరుతో బెట్టింగ్ అనేది సాధారణమైపోయింది. అయినా కోడిపందేలు ఒక సంప్రదాయానికి చిహ్నం. మరి దీని చరిత్రను మనమూ ఒకసారి అవలోకనం చేసుకుందాం

*6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియాలో కోడి పందాలు జరిగాయని తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో ఈ సంప్రదాయం తరతరాలుగా సంక్రమించి ఇప్పటికీ కొనసాగుతోంది. సాధారణంగా బెట్టింగ్ కోసం కోడిపందేలు ఆడేవారున్నా.. ప్రసుత్తం  ప్రభుత్వం దానికి అడ్డుకట వేసింది. అయినా కొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా బెట్టింగులు నిర్వహించడం గమనార్హం.

*మీకో విషయం తెలుసా.. పందెం కోళ్లల్లో కూడా చాలా జాతులున్నాయి. వాటిని విభజించి వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు.  రసంగి, కౌజు, మైల, చవల, సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి, ఎరుపుగౌడు, తెలుపుగౌడు లాంటి పేర్లతో వాటిని పిలుస్తుంటారు. డేగ, కాకి బాగా పాపులరైన జాతులు

*అలాగే పందెం కోడిపుంజులకంటూ ఒక పంచాంగం ఉంది. దానినే "కుక్కుట శాస్త్రం" అంటారు. 

*పూర్వం ఆంధ్ర క్షత్రియులు (రాజులు) తమ పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజుల్లో కుక్కుట శాస్త్రాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారు.  బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధానికి కారణం కూడా కోడి పందేలే అన్నది జగమెరిగిన సత్యం

*1646లో జార్జి విల్సన్‌ అనే ఓ ఆంగ్ల రచయిత  కాక్‌ ఆఫ్‌ ది గేమ్‌  అనే గ్రంథంలో కోడి పందేల గురించి రాశారు. ఇరాన్‌, ఇండోనేషియా, బ్రెజిల్‌, పెరు, ఫిలపైన్స్‌, మెక్సికో, ఫ్రాన్స్‌, క్యూబా, పాకిస్తాన్‌, అమెరికా, జపాన్‌, మొదలైన దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోడి పందేల ఆచారం ఉంది

*కుక్కుటశాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాశారని చెబుతుంటారు. ఏ సమయంలో ఏ జాతి పుంజును బరిలోకి దింపితే.. అది గెలుస్తుందో గణాంకాలు వేసి మరీ పందేలు కాస్తారు. కోడి యజమాని పేరులోని అక్షరాలు, తిథుల ఆధారంగా కూడా గెలుపోటములు ఆధారపడి ఉంటాయని కుక్కుట శాస్త్రం చెబుతుంది

*పందెం కోళ్ల పోషణ కూడా ఆషామాషీగా ఉండదు. వాటికి చాలా బలవర్థమైన ఆహారాన్ని అందిస్తారు. జీడిపప్పు, పిస్తా, బాదం కూడా వాటికి తినిపిస్తుంటారు. 

*ప్రస్తుతం పందెం కోళ్ళ అమ్మకానికి సంబంధించి ఆన్‌లైన్ మార్కెట్ కూడా బాగా పుంజుకుంది. కార్పొరేట్ బిజినెస్ కూడా షురూ అయ్యింది

*పూర్వకాలం నుండీ కోడి పందేలను నాలుగు రకాలుగా నిర్వహిస్తున్నారు. ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, డింకీ పందెం అని వాటిని పిలవవచ్చు.